ఇడి పొత్తికల భార్య నడికట్టుతో వచ్చి యందీయ బసిపాప నందికొనగ
జిటికతో బల్కరించిన దొట్టెలో బిడ్డ బోసినవ్వుల చిట్టిహౌసు మఱుగ
రా బాబు నీ విట్లు రా యని నవ్వుచు జేసాచ మార్నవ్వు శ్రీల కుబుక
గృహము జేరినయంతనే కాళ్ళ కడ్డము వచ్చి మోకాళ్ళల బ్రాక నుబ్బు
దత సుకృత మేమి సేయు దంపతులు ధాత్రి
నోచుకొందురొ, నేనింత నోచలేదు,
అల్ల కౌసల్య నోచలేదా సుమిత్ర
నోచలేదు కైకయియు నోచలేదు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టిఖండంలోని ఈ పద్యం తెలుగుదనంతో ఉట్టిపడుతూ, పుత్రసంతానం లేకపోవటం వల్ల, దశరథుడు పడే ఆవేదనను, దానికోసం ఆరాటాన్ని తెలియజేస్తుంది.
తెలుగుదనమంటే ఇక్కడ ఒక జాతి సంస్కృతినీ, సంప్రదాయాన్ని తెలియజేసేది అని అర్థం. విస్తృత పరిధిలో, ఇది భారతీయ గృహస్థ ధర్మాన్ని తెలియజేస్తుంది.
బాలింత నడుముకు గుడ్డ కట్టుకొని, పొత్తిళ్ళలో శిశువును పెట్టుకొని, భర్త చేతులకు అందించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. బిడ్డ కొంచెం పెరుగిన తరువాత, ఉయ్యాల తొట్లో వేస్తారు. అటువెళ్తూ, ఇటువెళ్తూ, ఆ పసిబిడ్డను చిటికలు వేసి పల్కరించడం అనురాగానికి గుర్తు. చిటిక వేసినపుడు ఆ చిన్నారి ముఖంలోని సొగసు చూసితీరవలసిందే. బుడి బుడి నడకలతో తప్పటడుగులు వేసే పిల్లవాడిని " రా బాబు రా! రా నాన్నారా! " అంటూ నవ్వుతూ పకరించటం, దానికి ప్రతిగా పిల్లవాడు కిలకిలా నవ్వడం ఒక చెప్పలేని ఆనందం. అది తలిదండ్రులకు మహదైశ్వర్యం. పని మీద బయటకు వెళ్ళి రాగానే, పిల్లవాడు కాళ్ళకు అడ్డంపడి, మోకాళ్ళ మీదకు ఎగబ్రాకడం తలిదండ్రులకు ఒక గిలిగింత. వాళ్ళ మనస్సు సంతోషంతో ఉబ్బిపోతుంది. ఇంతటి భాగ్యాన్ని అనుభవించటానికి దంపతులు ఏమి నోము నోచి ఉంటారో? అటువంటి తియ్యదనాన్ని అనుభవించడానికి తాను నోచుకోలేదని, పట్టపురాణి కౌసల్య నోచుకోలేదని, సుమిత్రకు గాని, కైకేయికి గాని ఆ భాగ్యం లేదని దశరథుడు వాపోతున్నాడు. " నేనింత నోచలేదు / అల్ల కౌసల్య నోచలేదా సుమిత్ర / నోచలేదు కైకయియు నోచలేదు. " అనడంలో కనీసం ఇందులో ఒక్కరికైనా ఆ భాగ్యం కలుగలేదు కదా! అన్న భావం ద్యోతకమౌతున్నది.
No comments:
Post a Comment