సలుపుదునేని, యేన గురుసద్విజభక్తుడనేని, యేన య
త్యలఘు తపస్వినేని, దివిజాధిప భూసురులార ! మన్మనో
నిలయకు నీ ప్రమద్వరకు నిర్విష మయ్యెడు నేడు మీ దయన్.
అపరిమితాజ్ఞ జేసియు మహాపురుషుల్ విషతత్త్వసంహితా
నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విష
వ్యపగతమైన జీవ మిది వచ్చు నుపాయము సేయరొక్కె ! నా
తపముఫలంబు నధ్యయనదానఫలంబులు నిత్తు వారికిన్.
తిరుగుచు బుట్టలం బొదల ద్రిమ్మరు బాముల రోసి రోసి ని
ష్ఠురతర దీర్ఘ దండమున డొల్లగ వ్రేయుచు, వచ్చి వచ్చి య
య్యిరవున డుండుభం బను నహిం గని వ్రేయగ దండ మెత్తుడున్
' హరి హరి ' యంచు డుండుభమహాహి భయంపడి పల్కు భార్గవున్.
చ్యవనునకు సుకన్యకు పుట్టినవాడు ప్రమతి. ప్రమతికి అప్సరస ఘృతాచికి భృగువంశంలో గొప్పవాడైన రురుడు జన్మించాడు. రురుని వృత్తాంతమే ఈ మూడు పద్యాలలోని సారాంశము.
పైన చెప్పిన రురుడు అనే మునికుమారుడు, విశ్వవసుడు అనే గంధర్వునికి మేనకకు పుట్టిన ప్రమద్వరను ప్రేమించి, వివాహం చేసుకొనడానికి నిశ్చయించుకొన్నాడు. ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్నది.
ఒకరోజు, తోటి స్నేహితురాళ్ళతో ఆడుకుంటూ ప్రమద్వర ఒక పాము తలపై కాలు వేసింది. ఆ పాము కరవటం వల్ల, ప్రమద్వర చనిపోయింది. మునులందరూ అది చూసి చాలా దుఃఖించారు. రురుడు ఇక అక్కడ ఉండలేక అడవిలోకి వెళ్ళి దేవతలను, బ్రాహ్మణులను ఉద్దేశించి ఇలా ప్రార్థించసాగాడు.
" ఓ దేవతలారా ! బ్రాహ్మణులారా ! నేనే కనుక ఏ మాత్రం అశ్రద్ధలేకుండా, దేవతా పూజ, యజ్ఞయాగాలు, వ్రతాలు, దానాలు, వేదాధ్యయనం చేసినవాడినైతే, నేను గురువులని, సద్బ్రాహ్మణులను భక్తితో సేవించినవాడినైతే, నేను గొప్ప తపస్సు చేసినవాడినయితే, నా మనస్సంతా నిండి ఉన్న నా ప్రాణసమానమైన ప్రమద్వర మీ అందరి దయచేత విషవిముక్తురాలవు గాక !
మంత్రశాస్రజ్ఞులైన మహాత్ములు కట్టడి చేసి గాని, విషతత్త్వ శాస్త్రం బాగా తెలిసిన మంత్రజ్ఞులు విరుగుడు మంత్రాలను ఉచ్ఛరించి గాని, విగతజీవిగా పడి ఉన్న నా ప్రమద్వరకు ప్రాణాలను తిరిగి తెప్పిస్తే, నేను వారికి నా తపఃఫలం , దానఫలం, అధ్యయనఫలం ధారపోస్తాను. "
ఈ రకంగా దుఃఖిస్తున్న రురుణ్ణి చూసి, ఆకాశమార్గంలో పయనిస్తున్న ఒక దేవదూత ప్రమద్వరను బ్రతికించుకొనే ఒక ఉపాయం చెప్పాడు. ప్రమద్వరకు కనుక రురుడు తన ఆయుస్సులో సగభాగం ఇస్తే, ప్రమద్వర పునర్జీవితురాలవుతుందని చెప్పాడు. రురుడు ఆ విధంగానే ప్రమద్వరకు తన ఆయుస్సులో సగం ధారపోసి, ప్రమద్వరను బ్రతికించుకొని. తరువాత వివాహమాడి, సుఖించసాగాడు.
కానీ రురునికి, తన భార్యకు అపకారం చేసిన పాములపై కోపం మాత్రం పోలేదు. అప్పటినుండి, రురుడు ఒక పెద్ద కర్రను చేతిలో పుచ్చుకొని అడవుల్లో తిరుగుతూ, పుట్టలను త్రవ్వుతూ, కనపడ్డ పాముని కనపడ్డట్టు చంపసాగాడు. ఒకరోజు అట్లాగే విషం లేని డుండుభ మనే పామును చంపడానికి కర్ర పైకెత్తగానే, ఆ డుండుభం భయపడి, హరినామాన్ని ఉచ్ఛరిస్తూ, ఉత్తమకులంలో పుట్టి, యజ్ఞయాగ, దాన, వ్రతాలు విరివిగా చేసే రురుడు ఇంత క్రూరంగా పాములను చంపటానికి కారణమేమిటాని అడిగింది. పాముకాటుతో తన భార్య చనిపోవటం, తదనంతర వృత్తాంతమంతా సవివిరంగా చెప్పి, డుండుభాన్ని చంపటానికి యమదండం లాంటి కర్రను మళ్ళీ పైకెత్తాడు. అంతే, డుండుభం ఒక ముని రూపం దాల్చింది. ఆశ్చర్యానికి గురయిన రురుడు ఆ మునిని పాముగా ఎందుకు మారవలసి వచ్చిందో అడిగాడు. ఇదీ ఇప్పటివరకు రురుని కథ.
No comments:
Post a Comment