నీలగళాపరాధి యగు నీకు దనూభవ నౌట చాలదా?
చాలు గుమర్త్య ! నీదు తనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడి
న్నేల ధరన్ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్
గాలుపనే? తలంప జనకా ! కుటిలాత్మక యెన్ని చూడగన్.
కుమర్త్యుడు = చెడ్డమనిషి; నీచ మానవుడు.
తనుజాత = కుమార్తె
కుటిలాత్మకుడు = వంకర బుద్ధి కలవాడు
అవమానం పాలవుతుందని చెప్పినా కూడా పుట్టింటి మీద మమకారంతో సతీదేవి దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్ళింది. తండ్రి తనను అవమానించటమే కాక, శివదూషణకు పాల్పడ్డాడు. శివాపరాధాన్ని సహించలేని సతీదేవి ఇలా అంటున్నది.
" శివదూషణ చేసిన నీ వంటి వానికి కుమార్తె నయ్యాను. అది చాలదా సిగ్గు పడటానికి? నీచమానవుడా ! నీ ప్రేలాపనలు ఇక కట్టిపెట్టు. నీ కూతురునని చెప్పుకోవడానికే సిగ్గువేస్తున్నది. మహాత్ములకు కీడు తలపెట్టే మీ బ్రతుకు లెందుకు? తగలబెట్టనా? "
శివుడు నీలగళుడు. లోకకళ్యాణం కోసం, భయంకరమైన కాలకూట విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. అందుకనే, ఆయన మహాత్ముడు. లోకోద్ధరణ చేసే అటువంటి మహాత్ములను దూషించేవారు నీచమానవులు, కుటిలాత్ములు. వారి జీవితం వ్యర్థం.
సతీదేవి పాతివ్రత్యాన్ని తెలిపే ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము, చతుర్థస్కంధంలో ఉన్నది.
No comments:
Post a Comment