పాలక ! నీకు బట్టు వఱుపన్? మఱి ధర్మ వెఱుంగ వీనికిం
బోలునె రాగకోప పరిభూత మనస్కున కల్పరాజ్య ల
క్ష్మీ లలనాంధబుద్ధి కనిమిత్త మహత్పరివాదశీలికిన్.
అవినయబుద్ధివై హరికి నర్ఘ్య మయోగ్యమ యంటి; నీవు మూ
ర్ఖవు శిశుపాల ! యింక బలుకన్ వలసెన్ సభలోన నున్న యీ
యవనిపులెల్ల నాతని దయO బరిముక్తులు, వానిచేత నా
హవ జితులుం, దదీయశరణార్థులుగా కొరులయ్య చెప్పుమా !
భీష్ముడు శ్రీకృష్ణుడిని అగ్రపూజకు అర్హుడని నిర్ణయించటం శిశుపాలునికి కోపకారణమై, ఆ పరమాత్ముడిని పలు విధాలుగా నిందించాడు. ధర్మరాజు అతడిని బుజ్జగించటానికి ప్రయత్నించాడు. ఇది చూసిన భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు:
" ధర్మరాజా ! ఈ శిశుపాలుడు చెడు నడవడిక కలవాడు. ఇతని మాటలు, చేతలు చూస్తుంటే పిల్ల చేష్టలుగా ఉన్నాయి. ఇటువంటివాడికి ధర్మాన్ని గురించి ఎందుకు చెబుతావు? ఇతడు అసూయతో మాట్లాడుతున్నాడు. ఏదో తన చిన్న రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని చూసి విర్రవీగుతున్నాడు. దానితో గుడ్డివాడిలాగా మంచిని చూడలేకపోతున్నాడు. అటువంటివాడికి ధర్మం తలకెక్కుతుందా? "
ఆ తరువాత భీష్ముడు శిశుపాలుడి వైపు చూసి ఇలా అన్నాడు:
" ఓ శిశుపాలా ! నీవు వినయం లేకుండా కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వద్దని మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు. ఇక్కడకు వచ్చిన రాజు లందరూ జరాసంధుని చెరలో నుంచి శ్రీకృష్ణునిచే విడిపింపబడినవారు లేకపోతే ఆయన చేతిలో ఓడిపోయినవారు లేదా ఆయన శరణు కోరినవారు. అలాకాకుండా ఇతరులు ఎవరున్నారో చెప్పు. "
ఈ సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వం, ద్వితీయాశ్వాసానికి డాక్టరు అప్పజోడు వేంకటసుబ్బయ్యగారు విశేష వ్యాఖ్యను అందించారు. దానిని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.
" ఈ పద్యాలు శిశుపాలుడి చెడు స్వభావాన్ని ప్రతిఫలించే అద్దములు. ధర్మతత్త్వాన్ని గ్రహించటానికి రాగద్వేషరహితమైన సమచిత్తం ఉండాలి. అహంకారం, అవివేకం ఉండకూడదు. శిశుపాలుని స్వభావంలో ఉండవలసిన సమచిత్తత లేదు. ఉండగూడని అహంకారం, అవివేకం మెండుగా ఉన్నాయి. అందుచేత, ' ధర్మరాజా! ఇతనికి ధర్మతత్త్వాన్ని చెప్పి ఒప్పించే ప్రయత్నం వ్యర్థ ' మని భీష్ము డంటున్నాడు. అంతేకాదు, ' భూపాలక ! నేల నాలుగు దిక్కులు జయించి సార్వభౌమ యోగ్యమైన రాజసూయయాగం చేసే మహారాజా ! వీనిన్ - ఈ తక్కువవాణ్ణి, అల్పరాజ్య లక్ష్మీలలనాంధబుద్ధిని, అనిమిత్త మహత్పరిశీలవాదిని - ఒప్పించే ప్రయత్నం నీకు అనవసర ' మని కూడా అంటున్నాడు.
రెండవ పద్యంలో ' హరి ' శబ్దప్రయోగం ఉచితంగా ఉంది. శ్రీకృష్ణుని విష్ణుత్వం మీద, శిశుపాలుని మూర్ఖత్వం మీద ఆ మాట వెలుగులను ప్రసరిస్తున్నది.
No comments:
Post a Comment