మునిపత్నుల్ జనకాత్మజాత కనుదమ్ముల్ ముంగురుల్
కని తద్భూషలు చీనివస్త్రములునుం గన్గొంచు మున్నాడగా
వినినామంచు భ్రమింత్రు దేవియని వెన్వెంటన్ భ్రమల్ వాయగన్.
ఆశ్రమాలలోని మునులు, బ్రహ్మచారులు రామచంద్రుని ముఖపద్మాన్ని చూస్తున్నారట. మునిపత్నులు మాత్రం జానకి తామరల వంటి కళ్ళను, ముఖం మీదకు వ్రాలుతున్న జుట్టును, పెట్టుకొన్న నగలను, కట్టుకొన్న పట్టుచీరను చూసి, అంతకుముందు పాటలలో విన్న అమ్మవారి స్వరూపాన్ని గుర్తుకు తెచ్చుకొని, వెనువెంటనే ఊహల్లో నుంచి బయటకు వచ్చారట.
స్త్రీపురుష మానసిక తారతమ్యాన్ని సూచించే యీ పద్యం సహజత్వానికి చాల దగ్గరగా ఉంది. సామాన్యంగా మగవారు వచ్చినవారి మాటతీరు, ముఖలక్షణాలను గమనిస్తారు. అదే ఆడవారైతే, వచ్చిన ఆడవారి కనుముక్కుతీరు, నగలు నాణ్యాలు, కట్టుకున్న చీర - ఇవన్నీ చూస్తారు.
అయితే, ఇందులో ఇంకొక విశేషం ఉంది. ఈ మునిపత్నులు నిరంతరం లలితాసహస్రనామ పారాయణ చేస్తూ ఉండవచ్చు. జానపదులు పాడే అమ్మవారి పాటలు వింటూ ఉండవచ్చు. ఆ పాటల్లో పరమేశ్వరీస్వరూపం వాళ్ళ కళ్ళకు కట్టినట్లుంటుంది. అందుకని, జానకిని చూడగానే, ఆమె అమ్మవారనే గాఢమైన తలపులోనికి వెళ్ళిపోయారు. తరువాత తెప్పరిల్లి, బాహ్యస్మృతిలోకి వచ్చారు.
రామాయణగత బహు స్త్రీపాత్రలలో వాల్మీకి మహర్షి యీ పరమేశ్వరీతత్త్వాన్ని నిబద్ధం చేశారు. ఇక్కడ, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణియైన సీత మునిపత్నుల కనుల ముందుంటే, పరిణతమనస్కులైన మునిపత్నులు ఆ విధంగా భావించటంలో ఎంతైనా ఔచిత్యం ఉంది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్యకాండము, దశవర్ష ఖండములో ఉంది.
No comments:
Post a Comment