మనమారంగ ద్రుటిక్షణంబయిన నిన్ మర్త్యుండు భావించి దు
ర్జనుడున్ సజ్జనుడౌను, దుఃఖపరుడున్ సౌఖ్యాత్ముడై
ఘనుడౌ, మూర్ఖును బండితుం డగు, మహాకష్టుండు శిష్టుం డగున్,
ధనహీనుండు ధనేశుడౌ, జగమునం దారిద్ర్యవిద్రావణా!
శివుడు తలచుకొంటే జరుగని పని ఏముంటుంది? నిజమే. కొంచెం సేపయినా, చిత్తశుద్ధితో, శరణాగతి తత్త్వంతో, శివుని తలచుకోవాలి. భౌతిక ప్రపంచాన్ని మరచిపోవాలి. అప్పుడు, శివుణ్ణి ఏమి కోరికలు కోరినా సిద్ధిస్తాయి. శివుని దయ ఉంటే, చెడ్డవాడు మంచివాడుగా మారుతాడు. దుఃఖాన్ననుభవించేవాడు సుఖం పొందుతాడు. అల్పుడు గొప్పవాడవుతాడు. మూర్ఖుడు పండితుడౌతాడు. పాపాత్ముడు పుణ్యాత్ముడౌతాడు. కటిక దరిద్రుడు కూడా కుబేరుడౌతాడు. ఇవన్నీ జరుగుతాయి.
కీలకం ఇక్కడే ఉంది. చిత్తం శివుని మీద పెడితే, శివుడు ఇవన్నీ సమకూరుస్తాడు. కానీ, చిత్తం శివుని మీద పెట్టం కదా! నిజానికి, చిత్తం శివునిలో లయమైనప్పుడు, కోరికలనేవే కలుగవు.. కాబట్టి, శివుడు సర్వశక్తిసంపన్నుడు అని చెప్పడమే ఈ పద్యం యొక్క ఉద్దేశ్యం. భౌతికమైన కోరికలు తీర్చి, దారిద్ర్యాన్ని పోగొడతాడని ఐహికజీవులు, కోరికలు కోరే మనోదారిద్ర్యాన్ని రూపుమాపుతాడని ఆముష్మిక జీవులు భావిస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment