కామంబుం బెడబాచు బండితుడు సంకల్పంబు వర్జించి, ని
ద్రామోహంబు నడంచు సత్త్వగుణ చింతన్, లోభముం ప్రాజ్ఞ సే
వాముద్రం దొలగించు, గ్రోధము శమవ్యాప్తిన్ మగుడ్చున్ మతి
శ్రీమాన్యా! భయ మప్రమాదమున నిర్జించున్ దృఢస్వాంతుడై.
వ్యాసుడు శుకుడికి పరబ్రహ్మప్రాప్తిసాధన మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు. దానిలో భాగంగా, యోగికి, కామం, క్రోధం, భయం, నిద్ర, లోభం అనేవి చాలా చెడ్డగుణాలని, అందువల్ల, స్థిరచిత్తంతో, పట్టువదలని సాధనతో యీ అయిదింటిని వదలించుకోవాలని చెప్పాడు.
మనస్సులో సంకల్పాలు పుడతాయి. అందుచేత, యోగి, సంకల్పాలను విడచిపెట్టి కోరికలను అరికడతాడు. సత్త్వగుణ చింతనం చేత నిద్ర అనే మోహాన్ని తొలగించుకొంటాడు. బుద్ధిమంతుల సేవ చేత పిసినారితనాన్ని పోగొట్టుకుంటాడు. అంతరింద్రియ నిగ్రహం చేత క్రోధాన్ని మరలిస్తాడు. జాగరూకతతో భయాన్ని జయిస్తాడు.
వ్యాసుడు శ్రీ శుకుడిని " మతి శ్రీ మాన్యా! " అని సంబోధించాడు. ' మతి శ్రీ ' అంటే ధీశక్తి, బుద్ధివిశేషం. బుద్ధివిశేషం చేత పూజింపదగినవాడు శ్రీశుకుడు. తండ్రి అయిన వ్యాసుడు, చిన్నతనం నుండి వైరాగ్యభావం కలిగిన శ్రీ శుకునికి తత్త్వబోధ చేయడం ఒక లీల. అదే మహాత్ముల త్రోవ. శుకుడు జనకుని వద్ద జ్ఞానసముపార్జన చేసిన సన్నివేశాలను పురాణాల్లో చూస్తాము.
No comments:
Post a Comment