బ్రాహ్మణాచారంబు బరిహాసకము సేయు
నగ్నిహోత్రవిధానమన్న నలుగు
సంధ్యాభివందన శ్రద్ధ యుజ్జన సేయు
గీత వాద్య వినోద కేళి దగులు
బాషండ భండ దుర్భాష లావర్తించు
ద్యూతకారులతోడి యుద్ది వడయు
ధాతువాదుల మీద దాత్పర్య మొనరించు
జెలిమి వాటించు నాస్తికుల తోడ
నటుల మన్నించు, హర్షించు విటుల జూచి
పీఠమర్దుల కొనరించు బెద్దఱికము
కౌలటేయుల బాటించు గారవించు
శిష్టకుల దీక్షితుని పట్టి సిగ్గు విడిచి.
ఈ పద్యం శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము కావ్యం, చతుర్థాశ్వాసం, కుబేర వృత్తాతం లోనిది.
కాంపిల్యనగరంలో యజ్ఞదత్తుడు అనే శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన వేదవేదాంగవేత్త. షడ్దర్శనాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. యజ్ఞయాగాది క్రతువులు చేయడం, చేయించడంలో ఆరితేరినవాడు. అతడికి గుణనిధి అనే కొడు కున్నాడు. అతడు చాలా అందగాడు. సకాలంలో తండ్రి అతనికి ఉపనయనం చేశాడు. ఈ గుణనిధి జూదరి. ప్రొద్దుపొడుపు నుంచి ప్రొద్దుగూకే వరకు వ్యసనపరులైన స్నేహితులతో కలిసి తిరుగుతూ, తన కులగౌరవాన్ని, ఇంటి పేరుని మంట కలుపుతున్నాడు.
ఈ పద్యంలో శ్రీనాథుడు, గుణనిధి యొక్క విచ్చలవిడితనాన్ని చక్కగా వర్ణించాడు.
బ్రాహ్మణులు ధర్మాన్ని తాము ఆచరించి, సమాజంలో ప్రవర్తిల్ల చేయవలసినవారు. గుణనిధి బ్రాహ్మణాచారాలను పాటించకపోవడమే కాదు, వాటిని పరిహాసం చేస్తాడు. శ్రోత్రియబ్రాహ్మణ గృహాల్లో నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. అగ్నిహోత్రం సలపమంటే కోపం వస్తుంది. మూడు వేళలా సంధ్యావందనం చేయాలి. అది బొత్తిగా మానేసాడు. ఎల్లపొద్దులూ గీతవాద్యకేళి సలుపుతున్నాడు. అంటే, పిచ్చి పాటలు, పిచ్చి గంతులు వేస్తూ, వినోదంలో తేలియాడుతున్నాడు. పాషండులు అంటే వేద దూషణ చేసేవాళ్ళు. భండులు అంటే చెడ్డవాళ్ళు. వేద దూషణ చేస్తూ, ఊళ్ళోని ఆకతాయిజనంతో చేరి, వారితో కలిసి తిరుగుతూ, వాళ్ళు మాట్లాడే అసభ్య భాష మాట్లాడుతూ ఉన్నాడు. జూదం ఆడుతూ పందాల మీద పందాలు కాస్తున్నాడు. ధాతువాతుల మీద మాత్రం గట్టి నమ్మకం పెట్టుకొన్నాడు. ధాతువాదులు అంటే రసవాదులు. వాళ్ళు పాదరసం, ఇంకా కొన్ని పసరులతో, బంగారం తయారు చేస్తామని నమ్మిస్తారు. అటువంటి వారి మీద గుణనిధికి గట్టి నమ్మకం. మరి జూద మాడడానికి, తక్కిన వ్యసనాలకి డబ్బు కావాలి కదా! నాస్తికులతో స్నేహం చేస్తున్నాడు. నాస్తికులు అంటే దేవుని మీద నమ్మకం లేనివాళ్ళు. పీఠమర్దులు అంటే నాయక సచివులు. నాయకునికి సలహాలిచ్చేవారు. గుణనిధి జూదరుల నాయకుడు. అతడి చుట్టూ తిరుగుతూ అతనికి సలహాలిచ్చే జూదరులను, తిరుగుబోతులను నెత్తిన పెట్టుకొంటాడు . వాళ్ళకి పెద్ద పీట వేస్తాడు. గుణనిధికి నటులంటే మహా ఇష్టం . విటులను చూసి సంతోషిస్తాడు. విటులు అంటే వేశ్యల దగ్గరకు వెళ్ళేవాళ్ళు. కులట లేక చెడినదాని సంతానం కౌలటేయులు. వాళ్ళంటే పట్టింపు లేదు. పైగా గౌరవిస్తాడు. శిష్టకుల పట్టి అంటే శ్రోత్రియుడైన యజ్ఞదత్తుని కొడుకు గుణనిధి. అతడు సిగ్గు అనేది పూర్తిగా వదిలేసి ఇవన్నీ చేస్తున్నాడు.
పూర్వం రోజుల్లో, శిష్టాచారపరులైన బ్రాహ్మణులు, నట, విట, గాయకులను పంక్తిబాహ్యులుగా పరిగణించేవారు. వారితో కలిసి భోజనం చేసేవారు కాదు. ఎందుకంటే, నటులు, విటులు, గాయకులు సమ్మొహానాస్త్రం వంటివారని, వారి మాటలు, చేతలు, పాటలు సమాజంపై దుష్ప్రభావం చూపిస్తాయని, వారికి దూరంగా ఉండేవారు. నటులు, గాయకులు యీ నాటి పరిస్థితిలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. విటులు, అప్పటికీ, ఇప్పటికీ, అంత దూరాన ఉంచవలసినవారే.
No comments:
Post a Comment