మనుజేంద్ర ! సంకల్పమున బుట్టు గామంబు
రూపఱు దేహ నిరూపణమున
బరుల దోషంబున బ్రభవించు గ్రోధమ
క్షీణక్షమాయుక్తి జేసి పొలియు
భూతాస్థిరత్వంబు బుద్ధి గానమి లోభ
మనఘ ! జనించు గాంచిన నడంగు
నజ్ఞానమున మోహమావహిల్లు నధర్మ
లేపవర్జనమున లేక తక్కు
గులమునను విద్యధనమున గలుగు మదము
మరలివాని పెంపూహింప మ్రందిపోవు
సాత్త్వికుడు గామి బొడము మాత్సర్య మదియు
జెడ గురూత్తమ సాధుసంసేవనమున.
భీష్ముడు ధర్మరాజుకి అరిషడ్వర్గాలు ఏ రకంగా పుడతాయో, వాటిని అరికట్టడ మెలాగో చెప్పాడు.
భీష్ముడు ధర్మరాజుకి అరిషడ్వర్గాలు ఏ రకంగా పుడతాయో, వాటిని అరికట్టడ మెలాగో చెప్పాడు.
" ఓ రాజా ! మనస్సులో కలిగిన భావం వల్ల కామం పుడుతుంది. దాని రూపం తెలిస్తే, ఆ కోరికను అరికట్టడానికి వీలవుతుంది. ఇతరులు చేసే తప్పు వలన మనకు కోపం వస్తుంది. దానికి విరుగుడు ఎక్కడలేని ఓర్పు చూపించడమే. ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ నశిస్తాయి అనే తెలివి లోపించటం వల్ల లోభం పుడుతుంది. ఆ తెలివి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లోభం పోతుంది. అవివేకం వల్ల మోహం కలుగుతుంది. అధర్మం జోలికి వెళ్ళకుండా ఉంటే అది నశిస్తుంది. కులం, చదువు, సంపద గర్వాన్ని కలిగిస్తాయి. వాటి పెంపుదలను ఊహిస్తే, అవే దూరమవుతాయి. సత్త్వగుణం అలవరచుకొనకపోవటం వల్ల పగ పుడుతుంది. గురువులని, సత్పురుషులను సేవించడం వల్ల అది తొలగిపోతుంది. "
మనందరికీ లోపల ఆరుగురు శత్రువు లున్నారు. ఈ లోపలి శత్రువులను జయించటం చాలా కష్టం. ఇది నిరంతర సాధన వల్ల మాత్రమే సాధ్యం. క్రింద పడినప్పుడల్లా పైకి లేస్తూ, విశ్వామిత్రుడు నిరంతర సాధన చేసి బ్రహ్మర్షి పదాన్ని పొందాడు. అందుకనే విశ్వామిత్రుడు మానవునికి అతి దగ్గరివాడు, విశ్వానికి మిత్రుడు అయ్యాడు.
ఈ సీసపద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment