వీపులపై వ్రాలు పిట్టలు పడకుండ
లీలగా నడిచెడి లేటికాన
లనిలాగ్రనీయమా నాప్సరో గానస్వనం
బాలకించెడి నాగకన్య
లూహప్రయుక్త సత్స్వాహావచస్సమ
వహ్ని కుండోద్గారి ఫలరసంబు
లానుపూర్వీ పరివ్యాప్త వర్ణిసహస్ర
శీఘ్ర నిర్వర్తి తాశీస్సహస్ర
మాత్మకుల మ్మరుదెంచె నంచాశ్రమస్థ
సరసి దలలెత్తి జూచెడి జలరుహాళి
చూడజూడగ రఘురామచూడమునకు
శాంతభోగమ్ము స్వర్గమ్ము సరణి దోచె.
శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నాడు, మున్యాశ్రమాలను సందర్శిస్తున్నాడు. మున్యాశ్రమాలలోని ప్రశాంత వాతావరణం ఆయనకు స్వర్గంలాగ తోచింది.
ఆశ్రమంలోని లేడిపిల్లలు, వాటి వీపుపై వ్రాలిన పిట్టలు పడకుండా నడుస్తున్నాయట. ఆశ్రమప్రాంతంలో వీచే గాలిసవ్వడి అప్సరసల గానాన్ని తలపిస్తున్నది. ఆ గానమాధుర్యానికి, ఆ గాలిపాటకు, నాగకన్యలు (పాములు) తలలూపుతూ ఉన్నాయట. యాజ్ఞికులు, తాము ప్రయోగించే స్వాహాకారాలకి తగినట్లుగా యాగకుండంలో ఫలరసాలు సమర్పిస్తున్నారట. ఒకదాని వెంబడి ఒకటిగా, బ్రహ్మచారుల యొక్క ఆశీస్సులు, శాంతిపాఠాలతో ఆశ్రమప్రాంతం నిండిపోయిందట. తమ కులానికి చెందినవాడు వస్తున్నాడని సరస్సులోని పద్మాలు తలలెత్తి చూసాయట. శ్రీమహావిష్ణువు పద్మనాభుడు కదా! పద్మాలు ఆయన బొడ్డు కానుపులు. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం చూసేసరికి రామచంద్రునికి, ఆశ్రమప్రాంతమంతా, శాంతభోగాన్ని కలిగించే స్వర్గంలాగా అనిపించిందట.
అడవుల్లో, పల్లెటూళ్ళలో, జంతువుల వీపులపై వ్రాలిన పిట్టలు, పడగ విప్పి ఆడే త్రాచులు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ప్రకృతి సౌందర్యానికి కమనీయ కావ్యత్త్వం కలిపించి, పఠితల హృదయాలలో అజరామరత్వం కలిగించడం మహాకవులకే సాధ్యం.
ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణాన్ని వర్ణించే ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్యకాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment