భయసహితుడగును భూపతి
నయేతర ప్రకటవర్తనమున జిటులు మృ
ణ్మయపాత్ర కాల్పుతగ్గిన,
నయశాస్త్రము గీసినట్లు నడువగ వలయున్
గ్రామ్య పశువుల బొలిమేర గాచి చంపు
పులుల మందిడి యాటవికులు వధించు
నట్టులు ప్రజాపకారపర్యాప్తుడైన
క్షితిపతికి బిట్టు సిలుగు తెచ్చెదరు ప్రజలు.
క్షితిపతియు మహావ్యసని, పుచ్చి నుసిరాలు
దూల మట్టులు తొలుత మంత్రులును నిలువ
బెట్టినను, బోటిగా నిల్చి తుట్టతుదకు
గుప్పకూలంగ జను నింటికప్పువోలె.
పాళముగ బాకమారిన పాత్రవోలె
గహనసంచారియైన వ్యాఘ్రంబువోలె
జేవ తాఱుగని దూలంబు ఠేవ నీవు
నయపరాక్రమస్థైర్య రత్నాకరమవు.
శ్రీరాముని యౌవరాజ్య పట్టాభిషేకానికి మహాపారిషదుల అంగీకారం లభించింది. సుమంత్రుడు రాముడిని వెంటబెట్టుకొని వచ్చాడు. ప్రజలంతా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం కోసం ఎదురుచూస్తున్నారని సుమంత్రుడు అన్నాడు. అప్పుడు, దశరథుడు రాముని వంక చూసి అతనికి కొన్ని రాజనీతి మర్మాలు చెప్పాడు.
రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకొంటూ మృదువర్తనంతో రాజ్యపాలన చేయాలి. అట్లా కాకుండా, క్రూరంగా ప్రవర్తిస్తే, సరిగా కాలని మట్టికుండ చిట్లిపోయినట్లు, రాజ్యం ఒడిదొడుకులకు లోనవుతుంది.
గ్రామం లోని పశువుల్ని పొలిమేరల్లో కాపువేసి చంపే పులుల్ని ఆటవికులు ముందు పెట్టి చంపినట్లుగా, ప్రజాకంటకుడైన రాజును ప్రజలు రహస్యంగా మట్టుబెడతారు.
రాజు వ్యసనపరుడై మంత్రులకు రాజ్యభారం అప్పగిస్తే, బాగా పుచ్చిపోయి నుసి రాలుతున్న దూలం మొదట గట్టిగా ఉన్నట్లు అనిపించినా, చివరకు ఇంటికప్పును కూల్చినట్లుగా, ఆ వ్యసనం రాజ్యాన్ని కూల్చేస్తుంది.
వండే పదార్థం చక్కగా ఉండాలంటే పాత్రశుద్ధి ఉండాలి. శుభ్రమైన పాత్రలాగా, చప్పుడుగాకుండా సంచరిస్తూ వేటాడే పులిలాగా, దృఢంగా ఉన్న ఇంటి దూలంలాగా, శ్రీరాముడు మంచితనం, పరాక్రమం, స్థిరచిత్తం కలిగి, ధీరగంభీరసముద్రుడై , యౌవరాజ్య పట్టాభిషేకానికి అర్హుడయ్యాడని దశరథుడు కుమారుడిని కొనియాడాడు.
రాజనీతిని తెలియజేసే ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యాకాండం, అభిషేక ఖండంలో ఉన్నాయి.
No comments:
Post a Comment