క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప.
శత్రువులందరిన్ గెలవ జాలిన దిట్టవు పార్థ ! యివ్విధిన్
క్షత్రియధర్మమున్ వదలి క్లైబ్యుని చందము నొంద నొప్ప దే
మాత్రము; లెమ్ము; నీ హృదయమందున ధైర్యము నొంది యీ కురు
క్షేత్రము నందు యుద్ధమును సేయగ గాండివమూని నిల్వుమా !
శ్రీకృష్ణుడు అర్జునుని ' పరంతప ! (శత్రువులను తపింపజేయువాడా ! ) అని సంబోధించాడు. ఈ సంబోధన మీద ఆధారపడి కృష్ణుని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి.
కర్తవ్య నిర్వహణ, అనగా, యుద్దము చేయవలసిన, తరుణంలో అర్జునుడు శోకతప్తమానసు డయ్యాడు. శత్రువులను తపింప చేయవలసిన అతి క్లిష్టమైన సమయంలో తన హృదయాన్ని తపింపజేసుకుంటున్నాడు. బాధకు గురి చేస్తున్నాడు. ధైర్యాన్ని కోల్పోతున్నాడు. గాండీవాన్ని ప్రక్కన పెట్టాడు. అది అర్జునుడు చేయవలసిన పని కాదు. యుద్దంలో శత్రువులను నిర్జించి ధర్మపరిరక్షణ చేయటం క్షత్రియధర్మం. అది శ్రీకృష్ణుడు కనిపెట్టాడు, రోగనిర్ధారణ చేశాడు. దీనిని భగవంతుడు హృదయదౌర్బల్యం అంటున్నాడు. హృదయము యొక్క దుర్బలత్వము చాలా నీచమైన పని. పిరికివాడికి ఉండే అవలక్షణం. అర్జునుని వంటి ధీరునికి, మహావీరునికి ఉండవసిన లక్షణం కాదు. పిరికివానికి హృదయ దుర్బలత్వం ఉంటుంది. ధైర్యం కలవానికి ఉత్సాహం ఉంటుంది. హృదయదౌర్బల్యం అజ్ఞానం వల్ల వస్తుంది. తెలియనితనం వల్ల వస్తుంది. దానిని ప్రక్కన పెట్టమంటున్నాడు భగవానుడు. విడిచిపెట్టమంటున్నాడు. ' ఉత్తిష్ఠ (లెమ్ము) అని దుర్బలత్వానికి గురైన హృదయంలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. కార్యసాధకులను తయారుచేయవలసిన బోధకుడు చేయవలసిన మొట్టమొదటి పని ఇదే. వారిలో పిరికితనాన్ని పోగొట్టాలి. పిరికితనం పోతే, దాని స్థానంలో ఉత్సాహం దానంతట అదే వచ్చి చేరుతుంది. ఈ కారణం చేత, శ్రీకృష్ణుడు మనిషి తత్వం గ్రహించి వైద్యం చేసే గొప్ప వైద్యుని వంటివాడు. మహాభిషక్కు. తత్వం తెలిసి మందు నిర్దేశిస్తే చక్కగా పని చేస్తుంది.
ఇదే, రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని ఈ శ్లోకంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు చేసిన బోధ.
ఈ సందర్భంగా నా భగవద్గీత అవగాహనకు మూలకారణం, యతీశ్వరులు, మహాజ్ఞాని, ఆధునిక కాలపు వివేకానందులు, పరమ హంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారేనని, ఇందున్న అక్షరముల కూర్పు మాత్రమే నేను చేసిన పని అని, భగవద్గీతకు నాచే చేయబడు వ్యాఖ్యానమును చదువుతున్న ప్రతిసారి పాఠకులు గుర్తుంచుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాను.
No comments:
Post a Comment