ఆదిజుడైన బ్రహ్మయుదయంబున కాస్పదమైనవాడు, వే
దాది సమస్త వాఙ్ఞయములందు బ్రశంసితుడైనవాడు, లో
కాది, త్రిలోకపూజ్యుడని యాత్మ నెఱింగి పితామహుండు దా
మోదరు జెప్పె బూజ్యుడని; యుక్తమ కా కిది యేమి చోద్యమే?
ధర్మరాజు, తాను చేస్తున్న రాజసూయ యాగంలో భాగంగా, భీష్మ పితామహుని సూచనతో శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయాలని నిశ్చయించుకొన్నాడు. కృష్ణునికి అర్ఘ్యమివ్వడానికి ఆయత్తమవుతుండగా, శిశుపాలుడు అడ్డగించి, ఆ మహానుభావునిపై తీవ్రమైన నిందారోపణలు చేశాడు. అప్పుడు ధర్మరాజు కల్పించుకొని శిశుపాలుడిని అనునయించడానికి ప్రయత్నించిన సన్నివేశ మిది.
" బ్రహ్మ సృష్టికర్త. అటువంటి బ్రహ్మ పుట్టుకకు స్థానమైనవాడు శ్రీ మహావిష్ణువు. ఆ విష్ణ్వావతారమే శ్రీకృష్ణుడు. సమస్త వాఙ్ఞయ ప్రపంచానికి తలమానికమైన వేదాలలో ప్రస్తుతింపబడిన వాడు, అన్ని లోకాల ఆవిర్భావానికి మూలమైనవాడు, ముల్లోకాల చేత పూజింపబడేవాడు శ్రీకృష్ణుడు. ఇది తన బుద్ధి విశేషంతో, జ్ఞానసంపత్తిచే గ్రహించిన భీష్మ పితామహుడు, శ్రీకృష్ణుడు అగ్ర పూజార్హుడని నిర్ణయించడం ఉచితమే కదా ! ఇది దోషం ఎట్లా అవుతుంది? ". అని ప్రశ్నించాడు ధర్మరాజు.
బ్రహ్మ పద్మసంభవుడు, శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి ఉద్భవించాడు. దామోదరుడు అంటే తులసిమాల ధరించేవాడు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment