వాతెఱ తొంటి కైవడి మాటలాడదు
కుటిలవృత్తి వహించె గుంతలములు
అక్షులు సిరులు రా నఱగంట గనుగొనె
నాడించె బొమగని యాననంబు
సనుగొమ ల్నెగయ వక్షముపేక్ష గడకొత్తె
బాణి పాదము లెఱ్ఱవాఱ దొడగె
సారెకు మధ్యంబు దారిద్ర్యములె చెప్పె
ఱొచ్చోర్వ కిటు లోగ జొచ్చె మేను
వట్టిగాంభీర్య మొక్కడు వెట్టికొనియె
నాభి నానాటి కీ గతి నాటి ప్రియము
చవుకయైనట్టి యిచ్చట జనదు నిలువ
ననుచు జారినకరణి బాల్యంబు జాఱె.
శ్రీకృష్ణదేవరాయలవారు రచించిన ' ఆముక్తమాల్యద ' మహాప్రబంధO, పంచమాశ్వాసంలో, గోదాదేవి బాల్యం నుండి యవ్వనం లోనికి అడుగుపెట్టిన పరిణామక్రమాన్ని ఎంతో అందంగా, హృద్యంగా, అద్భుతంగా వర్ణించారు.
ఆ అమ్మాయి బాల్యం జారిందట. జారడమనేది తెలుగులో ఒక చక్కని మాట. అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియని స్థితి. " వాడు మెల్లగా జారుకున్నాడు " అనే వాక్యంలో, వాడు ' ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయాడో ' తెలియదని అర్థం. విష్ణుచిత్తుడు పెంచుకొంటున్న అమ్మాయికి బాల్యం తొలిగిపోయి యవ్వనం ఎప్పుడు వచ్చిందో తెలియనన్ని మార్పులు ఆమె శరీరంలో పొడసూపాయి. ఆ క్రమవికాసాన్ని చూపించడంలోనే ఉంది ఈ పద్యం అందమంతా.
వాయి + తెఱ = వాతెఱ. వాయి అంటే నోరు. వాతెఱ, నోటి యొక్క ముఖద్వారం పెదవులు. ఆ పెదవులు ఇప్పుడు మాట్లాడటంలేదు. అంటే, బాల్యంలో వాగుడుకాయగా ఉన్న ఆమెకి సిగ్గు ముంచుకొచ్చి, ముక్తసరిగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్త్రీకి ముగ్ధత్వం అందం. జుట్టు వంకరలు తిరిగింది. ఉంగరాల జుట్టు, వాలు జడ స్త్రీ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. అందం ఇనుమడించడంతో, ఓరకంటితో చూడటం మొదలుపెట్టింది. ఇది శృంగారభావాన్ని పెంచుతుంది. ముఖమేమో కనుబొమలను ఆడించటం మొదలుపెట్టిందట, యవ్వనం రాగానే, కన్యలు కనుబొమల్ని క్రిందికీపైకి వయ్యారంగా ఎగరేయడం ఒక చెప్పలేని, చెప్పరాని మధుర శృంగారహేల. ముఖం, బాల్యం చేతిలోని ఆటబొమ్మను లాగేసుకొని బాల్యాన్ని తిరస్కరించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆటలాడుతుండేది. రజస్వల కాగానే, ఆటలు తగ్గుముఖo పట్టాయి. కొంచెం పెద్దరికం వచ్చింది. దీనినే, మన పెద్దలు చాల నాగరకంగా పెద్ద మనిషి అయిందనేవారు. ఇక ఱొమ్ము భారం పెరిగింది. అందుకే నిర్లక్ష్యం చూపించింది. ఎందుకంటే, చన్నులకు కొమ్ములొచ్చాయి, గర్వమొచ్చింది. చన్నులు కొమ్ములు తీరేసరికి, భారమయ్యేటప్పటికి, వక్షస్థలం వాటిని నిర్లక్ష్యంగా ప్రక్కకు నేట్టివేసింది. అంటే, స్తనసౌందర్యం పెరిగింది. ఎప్పుడైతే చన్నులకు కొమ్ములొచ్చాయో, గర్వం చూపాయో, చేతులు కాళ్ళు ఎర్రబడ్డాయి. స్తనముల ఆధిక్యతను చూసి చేతులూ కాళ్ళూ కళ్ళెర్రజేసాయి. నడుము మాటిమాటికీ దారిద్ర్యాన్నే సూచిస్తూ ఉంది, అంటే, సన్నబడింది. స్త్రీకి నడుము ఎంతో సన్నగా, ఉందా లేదా అన్నట్లు ఉంటే, అంత సౌందర్యవతి అని అర్థం. శరీరం రొచ్చు ఓర్చుకోలేకుండా ఉందట. బాల్యంలో ఆటలాడుతూ మురికిని ఓర్చిన శరీరం, బాల్యం జారి యవ్వనం వచ్చేసరికి శుభ్రంగా ఉండటానికి, స్నానం చెయ్యడానికి ఇష్టపడుతోంది. బొడ్డు లోతుగా ఉండి బెట్టుసరిపోతున్నది. ఇది శృంగారాన్ని పెంచే శరీర యవ్వనపు పొందిక. ఈ విధంగా బాల్యం, శరీరానికి నా మీద మునుపటి అనురాగం ఇప్పుడు లేదు, బాగా చులకనయిపోయాను అనే తలపుతో, ఇక ఇక్కడ ఉండలేను అనుకొని, ఏ మాత్రం చడీచప్పుడూ లేకుండా జారిపోయిందట, పారిపోయిందట.
" ఈ సందర్భంలో, ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర్రావుగారు, వారి సౌందర్యలహరీ వ్యాఖ్యానంలో, ఏమంటున్నారో చూద్దాము.
" బాల్య యౌవనావస్థల మధ్య సరిహద్దు ఎప్పుడు చెరిగిపోయిందో చూస్తున్నంతలో మొగ్గ పుష్పమైనట్లు ఆ రేఖ కన్పించలేదు. ఉల్లంఘనం తెలియదు గానీ, పూర్వాపరావస్థల భేదం తెలుస్తూనే ఉంది. అలాగే ఒక ఋతువులో వెనుదిరిగిపోవటం మరొక ఋతువు రావటం కానీ, వాటి సంధికాలం తెలియదు కానీ, పోవటం-రావటం తెలుస్తూనే ఉంది. వర్తమాన జ్ఞానం లేకుండానే జరుగుతున్న వైచిత్రి యీ పద్యం ప్రాణం. కనుక బాల్యం జారిపోయి యౌవన మంకురించింది. జారటం తెలియలేదు. యౌవనం వచ్చిందని స్పష్టం. యౌవనోద్భూతి నిలా వర్ణించిన ఘట్టాలు మృగ్యం. "
No comments:
Post a Comment