ఎప్పుడెదో దిగు లెప్పుడేవో సహింపగారాని
విప్పుకోజాలని చిక్కులను దెచ్చి పెట్టెదవేని
అప్పుడు నిను గూర్చి తలతునో కాని అన్నియునున్న
యప్పుడుకాదు శ్రీ కాళహస్తీశ్వరా! మహాదేవ !
కాళహస్తీశ్వరా! మహాదేవా ! మానవజీవిత మంటేనే దిగులుకూడు. ఎప్పుడూ ఏవో భరించటానికి వీలుకాని సమస్యలు వచ్చిపడతాయి. ఏవో చిక్కులు వచ్చి పడుతుంటాయి. ఆ చిక్కుముళ్ళను విప్పుకోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనపడటం లేదు. కష్టాలొచ్చి నెత్తిమీద పడినప్పుడు మాత్రం నిన్ను తలచుకుంటాను. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు గుర్తుకురావు. "
చిక్కు సమస్యలు ఎదురైనప్పుడు మానసికస్థైర్యం ఉండాలి. అప్పుడు ఆ చిక్కుముళ్ళను విప్పుకోవచ్చు. దీన్ని మహాకవి దాశరథి " గాలిబ్ గీతాలు " లో ఎంత చక్కగా చెప్పాడో చూడండి.
" గ్రంథి పడని నాడు కలవయ్యె నఖములు
గ్రంథి పడెను నేడు కలదె నఖము "
(చిక్కుముళ్ళు లేనప్పుడు చేతి గోళ్ళున్నాయి, ఇవాళ చిక్కుముడి పడింది, విప్పడానికి గోరు ఏది? )
సమస్యలనేవి లేనప్పుడు ఆత్మస్థైర్యం పుష్కలంగా ఉంది. ఇప్పుడు ఆత్మస్థైర్యం తగ్గిపోయింది, సమస్యల వలయంలో చిక్కుకున్నాను.
మానవుడి చిత్తశుద్ధి కూడా అంతే. జీవితం సంతోషంగా సాగిపోతున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. కష్టాలు తరుముకొచ్చినప్పుడు మాత్రం " దేవుడా ! నీవే దిక్కు " అనే తత్వం మనిషిది.
ఈ విషయాన్నే " విశ్వనాథ మధ్యాక్కరలు " అనే గ్రంథంలోని శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పై పద్యంలో కవి చెప్పింది.
No comments:
Post a Comment