నిండుమతిం దలంతు గమనీయ భుజంగమరాజమండలీ
మండను జంద్రఖండ పరిమండితమస్తకు దారమల్లికా
పాండురవర్ణు జండతరభంజను హేమగిరీంద్రచారుకో
దండు మహేశు గంధగజదానవభంజను భక్తరంజనున్.
శివుడు కమనీయ భుజంగమరాజమండలీమండనుడు. సర్పాంగదకంఠభూషణుడు. చంద్రఖండపరిమండితమస్తకుడు. అర్థచంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించినవాడు. తారమల్లికాపాండురవర్ణుడు. తారకల వలె, మల్లెపూవులాగా తెల్లని శరీరవాయ కలవాడు. చండతరభంజనుడు. భయంకరంగా యుద్ధం చేసేవాడు. హేమగిరీంద్రచారుకోదండుడు. మేరుపర్వతాన్ని విల్లుగా ధరించినవాడు. గంధగజదానవభంజనుడు. మదగర్వంతో ఉన్న గజాసురుణ్ణి సం హరించినవాడు. భక్తరంజనుడు. భక్తులను రంజింపజేసేవాడు. అటువంటి శివుని నిండు మనస్సుతో స్మరిస్తాను అని కవి మహాభాగవతము షష్ఠస్కంధం ఆరంభించే ముందు స్తుతించాడు.
శివుడు ప్రముఖులైన నాగరాజులను తన శరీరానికి ఆభరణాలుగా, వాసుకిని కంఠభూషణంగా ధరిస్తాడు. వాసుకి శరీరం తెల్లనిది. శివుని శిరోభూషణం చంద్రుడు తెల్లని వెన్నెలను ఆరబోస్తాడు. శివుని మేని ఛాయ తెలుపు. ఇవన్నీ కలిసి శివుడు ఒక వెలుగు ముద్ద, జ్ఞానస్వరూపుడు.
త్రిపురాసుర సంహార సమయంలో శివుడు మేరుపర్వతాన్ని విల్లుగా చేసుకొన్నాడు.
ఈ పద్యం ఏర్చూరి సింగయ కవి తెనుగు చేసిన శ్రీమదాంధ్ర మహాభాగవతము, షష్ఠస్కంధం లోనిది.
No comments:
Post a Comment