తామరసాక్షునంశమున దర్పకు డీశ్వరు కంటిమంటలం
దా మును దగ్ధుడై, పిదప దత్పరశ్వరు దేహలబ్ధికై
వేమఱు నిష్ఠ జేసి హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్.
అన్ని పురాణాలను వ్యాఖ్యానించి చెప్పగలవాడైన సూతమహర్షి, " ప్రాయోపవేశం చేసిన పరీక్షిన్మహారాజుకి శుకమహర్షి మహాభాగవత పురాణంలోని రుక్మిణీకళ్యాణం తరువాత కథాభాగాన్ని వినిపించసాగాడు" అని మహనీయులైన మునిశ్రేష్ఠులకు చెప్పాడు.
" శ్రీ మహావిష్ణువు కుమారుడైన మన్మథుడు శివుని కంటిమంటలలో కాలిపోయి, మరల తన దేహం పొందటం కోసం పరమేశ్వరుని గూర్చి కఠోర తపస్సు చేసి, రుక్మిణీకృష్ణులకు, అసురమర్దనుడైన శ్రీకృష్ణుని ప్రతిరూపమా అన్నట్లు, జన్మించాడు. "
శివుని కంటిమంటలలో కాలి బూడిదైపోయిన మన్మథుడు అనంగునిగా, ఒక్క రతీదేవికి మాత్రము దేహంతో కనిపిస్తూ, దేహప్రాప్తి కోసం వేచి ఉన్నాడు. తరువాత, కఠోర నిష్ఠతో తపస్సు చేసి, శివుని కృపచే, ద్వాపరయుగంలో రుక్మిణీకృష్ణులకు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు.
శ్రీమదాంధ్ర మహాభాగవతం, దశమస్కంధంలోని ప్రద్యుమ్నుని కథను గ్రహించి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు " ప్రద్యుమ్నోదయము " అనే అద్భుతమైన స్వతంత్ర కావ్యాన్ని రచించారు.
No comments:
Post a Comment