యుద్ధరంగంలో కర్ణుడు విజృంభించి పోరు సలుపుతున్నాడు. అయితే, అతనికి రథసారథ్యం చేయడానికి సరియైన సారథి దొరకలేదు. అందుకని, దుర్యోధనుడు శల్యుడిని కర్ణుడికి రథసారథ్యం చేయమని అడిగాడు. దానితో మహోగ్రదగ్రుడైన శల్యుడు, సుక్షత్రియుడైన తనను సూతకులంలో పుట్టిన కర్ణుడికి రథ సారథ్యం చేయమనడం ఉచితమేనా అని దుర్యోధనుడిని నిలదీసాడు. పొగడ్తలకు ఊరకే పొంగిపోతాడని తెలిసిన దుర్యోధనుడు, రథ సారథ్యంలో శల్యుడు శ్రీకృష్ణు డంతటివాడని అతడిని ఉబ్బేసాడు. ఆ మాటలకు ఉబ్బిపోయిన శల్యుడు సరే అన్నాడు. అయితే కొన్ని నిబంధనలను పెట్టాడు. ఆ సందర్భంలో, దుర్యోధనుడు శల్యునికి, రథికుని వలె సారథి కూడ యెట్లా సామర్థము, నేర్పూ కలిగినవాడయి ఉండాలో తెలిపే త్రిపురాసుర సంహార గాథను వినిపించాడు. ఈ వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి తన తండ్రి ధృతరాష్ట్రునికి చెబుతుంటే తాను విన్నానన్నాడు.
దేవదానవ యుద్దంలో తారకాసురుడు మరణించిన తరువాత, అతడి ముగ్గురు కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనేవారు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలు కోరుకొమ్మన్నాడు. వారు అజేయులుగా ఉండటానికి, మూడు అభేద్యమైన నగరాలు నిర్మించుకొని, కామగమనంతో యథేచ్ఛగా విహరించేటట్లు వరం పొందారు. దానవ శిల్పి మయుని అనుగ్రహంతో, బంగారం, వెండి, లోహ పురాలను నిర్మింపజేసుకున్నారు. తారకాక్షుడి కొడుకు, హరి అనేవాడు, బ్రహ్మను గురించి తపస్సు చేసి, ఆయన అనుగ్రహంతో, యుద్ధంలో చనిపోయిన వారిని బ్రదికించి, పదిరెట్లుగా చేసే దివ్యమైన జలం కలిగిన దిగుడుబావులను నగరాని కొక్కటి చొప్పున ఉండేటట్లు వరం పొందాడు. ఇక చావంటే భయం లేని దానవులు, త్రిపురాసురుల నేతృత్వంలో, విచ్చలవిడిగా తిరుగుతూ దేవతలను హింసించసాగారు. దేవత లందరూ బ్రహ్మదేవుడిని వెంటబెట్టుకొని శివుడి దగ్గరకు వెళ్ళి, త్రిపురాసురులను సంహరించి, తమను రక్షించమని ప్రార్థించారు.
శ్రీమదాంధ్ర మహాభారతము, కర్ణ పర్వము, ప్రథమాశ్వాసంలోని ఈ క్రింది పద్యాలు ఆ సందర్భం లోనివి.
అమరులకు నసురులకు నే
సముడ శివం బఖిల భూతజాలంబులకున్
సమత నొనరింప శివ నా
మము నాకుం జెల్లు లోకమాన్యం బగుచున్.
అనయము గ్రూరకర్ములగునట్టి విమూఢుల బిల్కుమార్ప బూ
నన తగు ధర్మవర్తను లనంజను మీయెడ ద్రోహులైన య
ద్దనుజుల ద్రుంచి మీకు బ్రమదం బొనరించెద దేజమున్ బలం
బును సగపాలు వెట్టి నను బొందగ జేయుడు మీరలందఱున్.
అప్పుడు శివుడు దేవతలతో ఈ విధంగా చెప్పాడు.
" నాకు దేవతలు, దానవులు సమానం. మీ ఇద్దరి విషయంలోనే కాదు. నాకు సర్వప్రాణులూ సమానమే. నేను అందరికీ శుభాన్ని కలిగిస్తూ సమభావంతో ఉంటాను కనుక నన్ను లోకంలో శివుడనే పేరుతో గౌరవిస్తున్నారు.
అయినా, ఎప్పుడూ ఎదుటివారిని పీడిస్తూ వారికి కీడు తలపెట్టే ఇటువంటి క్రూరాత్ములను, మూర్ఖులను ఉపేక్షించకూడదు. మీరంతా ధర్మబుద్ధి కలవారు. అందుచేత, లోకాలకు కీడు కలిగించే త్రిపురాసురులను సంహరించి మీకు సంతోషాన్ని కలుగజేస్తాను. మీరందరూ మీ పరాక్రమం, తేజస్సులలో సగభాగాన్ని నాకు చెందేటట్లు చేయండి. "
శివుడు భూమిని రథంగా , సూర్యచంద్రులు రథచక్రాలుగా, వేదాలు గుఱ్ఱాలుగా, మేరుపర్వతాన్ని విల్లుగా చేసుకొనడానికి అంగీకరించాడు. తనకు దీటైన సారథి కావాలన్నాడు. మళ్ళీ అందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు. ఆయనతో విషయం విన్నవించారు. శివుని రథసారథ్యం చేసేవాడు బలంలో కానీ, మానసిక బలంలో కాని రథికుడి కంటె గొప్పవాడు కావాలి. అటువంటివాడు బ్రహ్మదేవుడేనని దేవతలు నిర్ణయించి, శివునికి రథసారథ్యం చేయమని ప్రార్థించారు.
అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో ఇట్లా అన్నాడు.
మీరు నిజంబ చెప్పితిరి; మిక్కిలి నేర్పును లావుగల్గినన్
సారథి పోరులన్ రథికసత్తము దా గెలిపించు బుద్ధి దో
స్సార విలాస భంగులకు శర్వుడు మెచ్చగ నాగమాత్మ కో
దార హయంబులన్ నడపెదన్ దనుజుల్ వెఱగందు నట్లుగన్.
" మీరు చాలా బాగా చెప్పారు. నిజమే! సారథి మంచి బలం, మానసికస్థైర్యం, నేర్పు కలిగినవాడైతే గాని రథికుడిని యుద్ధంలో గెలిపించలేడు. కాబట్టి, శివుడు నా నేర్పు, ఓర్పు, పరాక్రమం, బుద్ధిబలం మెచ్చుకొనేటట్లుగా, దానవులు భయపడేటట్లుగా, అందరూ ఆశ్చర్యపడేటట్లుగా వేదాశ్వాలను నడిపిస్తాను. "
అనుకున్న రీతిలో శివుడు, బ్రహ్మ రథసారథ్యంలో త్రిపురాసుర సంహారం చేశాడు.
దుర్యోధనుడు ఈ ఇతిహాసాన్ని వినిపించి, కర్ణుడి కంటె, అర్జునుడి కంటె, కృష్ణుడి కంటె, బలంలోను, శౌర్యంలోను, బుద్ధిబలంలోను శల్యుడే గొప్పవాడని పొగిడాడు. దుర్యోధనుడి ప్రాణము, రాజ్యము అతడి అధీనంలో ఉన్నాయన్నాడు. తనను గెలిపించాలంటే అతడికే సాధ్యమన్నాడు.
కర్ణుడికి రథసారథ్యం చెయ్యడానికి శల్యుడు ఒప్పుకున్నా, దుర్యోధనుడి మనసులో ఎక్కడో అతడు పాండవ పక్షపాతంతో, కర్ణుడి మీద చిన్నచూపుతో, తనకు అననుకూలంగా ప్రవర్తిస్తాడేమోనని, అతడికి ఈ ఇతిహాసాన్ని చెప్పి ఉత్సాహపరిచాడు. రాజ్యతంత్రం తెలిసినవాడి, కార్యసాధకుడి తీరు ఈ విధంగా ఉంటుంది.
No comments:
Post a Comment