పుట్టుచునే వియత్తెగుర బోవకపోయిన, నన్ ద్రిలోక స
మ్రాట్టు పవిన్ ఘటింపక, కుమారునిపై దన కింత ప్రేమ యు
న్నట్టుల నెట్లుగా దెలియనయ్యెడి దింతటి యప్రధృష్యు డే
నెట్టుల నౌదు ! నప్పిత సమీరణదేవునకున్ నమస్కృతుల్.
సముద్రోల్లంఘనకు ముందు హనుమంతుడు తన తండ్రి వాయుదేవునకు అంజలి ఘటించాడు.
" పుట్టగానే, నేను ఆకాశంలోకి ఎగురకపోతే, త్రిలోకాధిపతియైన ఇంద్రుడు నన్ను వజ్రాయుధంతో కొట్టకపోతే, కొడుకు మీద తనకు ఇంత ప్రేమ ఉన్నదని ఎట్లా తెలిసేది? నేను ఇంతటి ఖ్యాతి గలవాడిని ఎట్లా అయ్యేవాడిని? ఇంతటి పేరుప్రఖ్యాతులు నాకు తెచ్చిన నా తండ్రి వాయుదేవునికి నమస్కరిస్తున్నాను."
ఈ పద్యం వెనుక ఒక పురాణ గాథ ఉన్నది. బాల ఆంజనేయుడు పుట్టగానే, ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసాడు. అది ఎఱ్ఱగా ఉండటం చేత పండనుకొన్నాడు. ఆకాశంలోకి ఎగిరి దానిని మ్రింగబోయాడు. రాహువు అడ్డం వచ్చి, బెదిరించబోయాడు. బాల ఆంజనేయుడు రాహువును కూడ మ్రింగబోయాడు. రాహువు వెళ్ళి ఇంద్రునికి మొరబెట్టుకొన్నాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో బాల ఆంజనేయుడిని హనువు (చెక్కిలి మీది భాగం) మీద కొట్టాడు. దానితో అంజనేయుడు మూర్ఛపోయాడు. కుమారుణ్ణి కొట్టినందుకు అలిగి, వాయుదేవుడు తన రూపాన్ని ఉపసంహరించుకొన్నాడు. లోకాలు గాలి లేక అల్లాడిపోయాయి. అందరూ బ్రహ్మదేవునితో మొరబెట్టుకొన్నారు. బ్రహ్మదేవుడు వాయువును శాంతింపజేసి, వాయుపుత్రుడైన ఆంజనేయునికి వరాలిచ్చాడు. హనువుకు దెబ్బ తగలడం వల్ల, ఆంజనేయుడు అప్పటినుండి హనుమ లేక హనుమంతుడిగా ప్రసిద్ధి కెక్కాడు.
ఈ పురాణగాథ ఆధారంగా విశ్వనాథ, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందరకాండము, పూర్వరాత్ర ఖండములో హనుమచే చేయబడిన వాయుదేవుని స్తుతిపద్యాన్ని అల్లారు.
No comments:
Post a Comment