పరిధానంబులు దేరు నశ్వములు చాపంబుం బరిస్ఫీత వ
జ్రరుచివ్యాప్త సువర్ణతాళమయ చంచత్కేతువున్ వర్మముం
గర మొప్పం దెలుపారు వెల్గొడుగుతో గంగాసుతుం డా సుధా
కరుడుంబోలె వెలిగెం దర్ప మెసగం గౌరవ్యసైన్యాబ్ధికిన్.
భీష్ముడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవ సేనకు ప్రథమ సర్వసైన్యాధ్యక్షుడు. ఆయన కట్టుకున్న వస్త్రాలు, అధిరోహించిన రథం, రథానికి కట్టిన గుఱ్ఱాలు, చేతిలోని ధనుస్సు,వజ్రాలతో తాపడం చేయబడి బంగారు రంగుతో ధగ ధగా మెరిసిపోతూ, గాలికి రెప రెప లాడే తాడిచెట్టు గుర్తు గల జెండా, శరీరంపై ధరించిన కవచం, రథంపై నున్న తెల్లని గొడుగు - ఇలా అన్నీ విశిష్టమైనవే. ఈ విధంగా భీష్ముడు కౌరవసేన అనే సముద్రానికి చంద్రుడు వలె ప్రకాశిస్తున్నాడు. పై వర్ణన, మొదటిరోజు కౌరవపక్షాన యుద్ధరంగానికి వచ్చిన భీష్ముని ప్రాముఖ్యతను చాటిచెపుతున్నాయి.
పరిధానము = వస్త్రము
కేతువు = జెండా
వర్మము = కవచము
తిక్కన వంటి మహాకవి " తెలుపారు వెల్గొడుగు (తెల్లనగు తెల్లని గొడుగుతో) " అని వ్రాసి పునరుక్తి దోషానికి పాల్పడతారా అని పెద్దలు సందేహాన్ని వెలిబుచ్చారు. అయితే చాలా ప్రతులలో ఇదే పాఠం ఉన్నదని అంగీకరిస్తున్నారు. " తెలుపారు" బదులు " పొలుపారు" అన్న పదాన్ని తీసుకొంటే, పునరుక్తి దోషం ఉండదని పెద్దలు చెబుతున్నారు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, భీష్మ పర్వము, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment