తన యెద యెల్ల మెత్తన కృత ప్రతి పద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి చెప్పలేని మె
త్తన యయి శత్రుపర్వత శతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం
కన గురువంచు చెప్పుకొనగా నది గొప్ప తెలుంగునాడునన్.
సనాతనధర్మంలో గురువు దైవసమానుడుగా భావించబడ్డాడు. తల్లిదండ్రుల ఋణం వలె, గురువు ఋణం తీర్చుకొనగలగడమనేది శిష్యుల అదృష్ట విశేషం. శ్రీమద్రామాయణ కల్పవృక్షకారుడు గురువుగారి ఋణం సంపూర్ణంగా తీర్చుకున్నారు వారి కావ్యావతారికలో.
విశ్వనాథవారి గురువు కిం కవీంద్రఘటాపంచానన బిరుదాంకితులు కీర్తిశేషులు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు. వారిని గురించి విశ్వనాథ ఏమంటున్నారో చూడండి.
గురువుగారి హృదయం చాలా మెత్తనిది. ఆయన చెప్పిన ప్రతి పద్యము అంతకంటె మెత్తనిది. శిష్యులంటే ఆయన గుండెలో గూడుకట్టుకొన్న ప్రేమ చెప్పరానంత మెత్తనిది. ఇంతటి మెత్తనివాడైన గురువుగారు సమకాలీన కవులనే పర్వతసమూహం పాలిట మాత్రం వజ్రాయుధం వంటి వాడు. అనగా, వాదంలో అంత దీటుగా వారిని ఎదుర్కొనేవాడు. అటువంటి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు గురువని చెప్పుకోవడం తెలుగు ప్రాంతాలలో ఆనాడు చాలా గొప్పగా భావించేవారు.
" చెప్పలేని మెత్తన" అన్న ప్రయోగం చాలా అందమైనది. ఆ మెత్తదనానికి అంతకంటె పెద్ద కొలమానం లేదు.
చెళ్ళపిళ్ళవారి శిష్యులు ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన కవి పండితు లెందరో ఉన్నారు.
No comments:
Post a Comment