తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో,
జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు ల
బ్దపదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్ భావింతు రెవ్వాని న
య్యపవర్గాధిపు డాత్మమూర్తి సులభుండౌ గాక నాకెప్పుడున్.
జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు ల
బ్దపదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్ భావింతు రెవ్వాని న
య్యపవర్గాధిపు డాత్మమూర్తి సులభుండౌ గాక నాకెప్పుడున్.
శుకమహర్షి పరీక్షిన్మహారాజుకి మహాభాగవత పురాణ ప్రవచనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. సంసారజీవులు, పశు, కళత్ర, పుత్ర, బాంధవ దేహాలు సత్యమని భ్రమించి, శాశ్వతము, మోక్షదాయకమైన ఆత్మతత్త్వాన్ని తెలుకోలేకుండా ఉన్నారు.
" బ్రహ్మ, రుద్రుడు మొదలైనవారు హరిపదాన్ని ఎలా చేరుకోవాలా - తపస్సుతోనా, మనోనిగ్రహంతోనా, దానాలు చేయటంతోనా, వ్రతాలు చేయటంతోనా, మంత్రాలను జపించటంతోనా, వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు చక్కగా ఆకళింపు చేసుకోవటంతోనా , మంచి భక్తిభావంతోనా - అని నిరంతరం చింతన చేస్తుంటారు. మోక్షప్రదాత, ఆత్మభవుడు అయినట్టి ఆ శ్రీ మహావిష్ణువు నాకు సులభుడగు గాక ! " అని ధ్యానం చేస్తూ శుకుడు విష్ణుచింతనాపరు డయ్యాడు.
అపవర్గము అంటే మోక్షం. మోక్షాన్నిచ్చేవాడు అపవర్గాధిపుడు.
తపస్సు అంటే, భగవంతుని గురించి తపించటం, నిరంతరం చింతన చేయటం. మనోనియతి అంటే ఇంద్రియాలను విషయవ్యాపారాల నుండి మళ్ళించి భగవదాయత్తం చేయటం. దానాలు, వ్రతాలు చేయటం వల్ల మనస్సు సత్కర్మాచరణ మీద కేంద్రీకృతమౌతుంది. మంత్రాన్ని జపించటం వల్ల ఏకాగ్రత కుదిరి, భగవంతుని మీద మనస్సు లగ్నమౌతుంది. శ్రుతి, స్మృతి, పురాణాదులను చక్కగా చదివి, ఆకళింపు చేసుకొనడం వల్ల, ధర్మబుద్ధి ఏర్పడి, ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. సునిశ్చలమైన భక్తిపరునికి విశ్వమంతా విష్ణుమయంగా కనిపిస్తుంది. పైన పేర్కొన్నవన్నీ వైకుంఠధామాన్ని చేరే మార్గాలు. కానీ, సంసారలంపటంలో చిక్కుకున్న జీవికి, ఏకాగ్రతతో భగవంతుడిపై దృష్టి సారించడం అంత సులభం కాదు. అందువల్లనే, బ్రహ్మ, రుద్రాదులు కూడా నిరంతరం ఆ వైకుంఠాధామాన్ని ఎలా చేరాలా అని చింతన చేస్తూ ఉంటారనడం.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము, ద్వితీయస్కంధం లోనిది.
No comments:
Post a Comment