అడిచిన, దిట్టినన్, మఱి మహాపరుషంబులు పల్కి యల్కతో
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు; వారల కెగ్గు సేసినం
జెడు నిహముం బరంబు, నిది సిద్ధము గావు టెఱింగి, భక్తి నె
ప్పుడు ధరణీసురోత్తముల బూజల దన్పుదు, నల్గ నోడుదున్.
భృగుమహర్షి భార్య పులోమ. ఆమెను మోహించి, పులోముడనే రాక్షసుడు అగ్నిగృహం నుండి ఎత్తుకొని పారిపోయాడు. అలా చాలా దూరం పరిగెత్తిన తరువాత గర్భం లోని శిశువు జారి క్రిందబడి ఆ రాక్షసుడిని భస్మం చేసాడు. అందుకనే, ఆ పిల్లవాడికి చ్యవనుడనే పేరు వచ్చింది.
కుమారుడితో పాటు ఇంటికి తిరిగివచ్చిన భార్యను విషయం అడిగి తెలుసుకొన్నాడు భృగువు. అగ్నిదేవుడు చెప్పటం వల్లనే రాక్షసుడికి ఆమె వాడు మోహించిన పులోమ అని తెలిసిందని కోపించి, అగ్నిదేవుడిని సర్వభక్షకుడవమని శాపమిచ్చాడు భృగువు. భృగుమహర్షి శాపమిస్తాడని తెలిసినా, అసత్యదోషానికి వెరచి తాను యీ పని చేసానని అగ్ని బదులిచ్చాడు. బ్రాహ్మణుడు పూజనీయుడు కనుక, తాను ప్రతిశాపం ఇవ్వడం లేదని అగ్ని చెప్పాడు. ఆ సందర్భం లోనిదే యీ పద్యం.
" కొట్టినా,తిట్టినా, పరుషవాక్యాలు పలికినా, కోపంతో అలిగినా, పోట్లాడినా, ఉత్తములైన బ్రాహ్మణులు పూజింపదగినవారు. అటువంటి పూజనీయులైన బ్రాహ్మణులకు అపకారం చేసినవాడు ఇహానికి, పరానికి చెడిపోతాడు. ఇది తథ్యం అని తెలుసు కాబట్టి, బ్రాహ్మణశ్రేష్ఠులను నేను ఎప్పుడూ భయభక్తులతో పూజిస్తాను. వారిని సంతుష్టులను చేస్తాను. "
ఇహము అంటే యీ లోకం. పరము అంటే మరణానంతరం పొందే స్వర్గలోకాది ఉత్తమ లోకాలు. బ్రాహ్మణులకు అపకారం చేసి వారి ఆగ్రహానికి గురైతే రెంటికి చెడిన రేవడి అవుతారని అగ్నిదేవుని భావం.
అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. అగ్నిదేవుడు ' ఉత్తమద్విజులు ' అన్నాడు. అంటే, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ, శమదమాది షడ్గుణాలను కలిగియున్న బ్రాహ్మణులని అర్థం చేసుకోవాలి. ఈ మాట, సత్యం పలికిన అగ్నిదేవుడి పట్ల సంయమనం కోల్పోయిన భృగువుకు కూడా కనువిప్పు కావాలి.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం లోనిది.
No comments:
Post a Comment