అనికి దొడంగు నప్పుడు మదాత్మ గలంగిన గొన్ని తత్త్వ బో
ధన మహనీయవాక్యము లుదాత్తకృపం దగ నీవు సెప్పి తే
మనమున వాని యర్థములు మాధవ ! నిల్పగ జాల నైతి న
వ్వినుతవచస్సుధారసము వీనుల నింకొకమాఱు నింపనే !
అర్జునుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో తనవారి నందరినీ చంపవలసి వస్తున్నందుకు విషాదానికి లోనయ్యాడు. ఆ సమయంలో కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడు. అర్జునుడు అంటే నరుడు, మానవుడు. అర్జునుడు మిషగా సర్వ మానవాళికి భగవంతుడైన కృష్ణుడు కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించి, తన విభూతిని కూడా విశదపరచాడు. భగవంతుడు బోధించాడు కనుక అది భగవద్గీత అయింది. సర్వ మానవాళికి ఆత్మజ్ఞానమనే కృష్ణుడి వచస్సుధాధారలు అర్జునుడి ద్వారా లభించాయి కనుక అర్జునుడి విషాదం యోగంగా మారింది.
అప్పుడు చెప్పిన ఆ మహనీయ వాక్యాలు ఇప్పుడు గుర్తుండలేదంటున్నాడు అర్జునుడు. వాటి సారాన్ని చక్కగా మనస్సులో నిలుపుకోలేదంటున్నాడు. అందుకని, ఆ అమృతంలాంటి మాటలను తన చెవుల కింపుగా ఇంకొకమారు చెప్పాలని కృష్ణుడిని వేడుకొంటున్నాడు.
గీతావాక్యాలు మహనీయవాక్యాలు. భగవద్గీత అన్ని ఉపనిషత్తుల సారమని, ఆత్మజ్ఞానాన్ని కలిగించే బ్రహ్మవిద్య అని, ప్రతి అధ్యాయం చివర ఉన్నది.
ద్వారకలో ఉన్న తలిదండ్రులను, బంధువర్గాన్ని చూడాలని ఉందని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. కానీ, ద్వారకకు వెళ్ళేముందు, తనకు ప్రాణసమానుడైన ధర్మరాజుని హస్తినాపురం వెళ్ళి చూసివద్దామన్నాడు. యదార్థానికి, శ్రీకృష్ణునికి ప్రాణసమానుడు అర్జునుడు. కానీ, ఇక్కడ ధర్మరాజుని ప్రాణసమానుడు అన్నాడంటే అది ధర్మరాజు యొక్క ధర్మాచరణాన్ని దృష్టిలో పెట్టుకొని. భగవంతుడు ధర్మస్వరూపుడు. ధర్మమునందు అనురక్తి గలిగిన వారంటే ఆయనకు ప్రాణంతో సమానం. ద్వాపరంలో అవతారమూర్తిగా భూమిపై పుట్టిన కృష్ణుడికి అర్జునుడు అనుంగుమిత్రుడు. అందుకే, చనువుగా " ఇంకొకమాఱు నింపవే! " అని అడుగుతున్నాడు.
No comments:
Post a Comment