మధు దైత్యాంతకుమీది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయా
వధి యే ప్రొద్దు దదీయ రూప గుణ దివ్యధ్యాన పారీణ ధీ
నిధి యౌటన్ శిశుపాలభూవిభుడు తా నిర్ధూత సర్వాఘుడై
విధి రుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా!
శిశుపాలుణ్ణి చక్రాయుధంతో వధించిన తరువాత, అతని దేహం నుంచి వెలువడిన ఒక దివ్యతేజస్సు శ్రీకృష్ణుడిలో లీనమయింది. ఇది చూచినవారందరు ఆశ్చర్యపోయారు. ఇదే సందేహాన్ని పరీక్షిన్మహారాజు వెలిబుచ్చాడు. దానికి శ్రీశుకుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
" విష్ణువు మీద మాత్సర్యంతో మూడు జన్మల నుంచి అతనితో వైరం పెట్టుకొని, ఎప్పుడూ విడవకుండా నిందించడమనే మిషతో, ఆ దివ్యపురుషుని ధ్యాన, రూప, గుణ విశేషాలను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండటం వల్ల, శిశుపాలుడు, సర్వ పాపాల నుండి విముక్తుడై, బ్రహ్మ రుద్రాదులకు కూడా పొందటానికి సాధ్యం కాని వైకుంఠపదవిని చేరుకోగలిగాడు. "
ఈ పద్యం చదవగానే మహాభాగవతంలోని " కామోత్కంఠత గోపికల్, భయమునన్ కంసుండు, వైరక్రియాసామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ " అన్న పద్యం గుర్తుకు రాకమానదు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధమునందున్నది.
No comments:
Post a Comment