చిటికిన వ్రేలితో శివుని విల్విఱిచిన ఘోరబాహుని నెత్తికోను నగునె
యనుభూతదనుజమర్దన కాలవికటత్వ మీతని బుగ్గ ముద్దిడగ నగునె
కోసలరాజ్య సిం హాసనాధ్యసన తర్కితు దొడ నీతని నెక్కింప నగునె
తన కాలి చెప్పు రాముని కాలసరిపోవు వయసులో గౌగిలింపంగ దగునె
రామచంద్రుని వయసు కారణము గాగ
నవనిపతి పొంగులగు ప్రేమ వ్యర్థమైన
నతడు పూనిన యంజలి నంజలించి
యతని యంజలిలో ముద్దులాడె నృపతి.
దశరథుడు, శ్రీరాముని యౌవరాజ్య పట్టాభిషేకానికి, మహాపారిషదుల అంగీకారం తీసుకొన్నాడు. నాలుగు వర్ణాలవారు ఈ వార్త విని ఉప్పొంగిపోయారు. దశరథుడు పంపగా, సుమంత్రుడు రాముడిని వెంటబెట్టుకొని వచ్చాడు. రథం దిగి, సుమంత్రుడితో పాటు మేడ మెట్లెక్కి వస్తున్న రాముడిని చూసి దశరథుడు, మనసులో ప్రేమ ఉప్పొంగి, ఈ విధంగా అనుకొంటున్నాడు.
" శివధనుస్సును అవలీలగా చిటికెనవ్రేలితో ఎత్తిన ఈ ఆజానుబాహుడిని ఎత్తుకొనగలనా? , కళ్ళెదురుగా ఉన్న ఈ రాక్షసాంతకుడనే కాలపురుషుని బుగ్గలను ముద్దులాడగలనా? , కోసలరాజ్య సిoహాసనాన్ని అధిష్ఠింపబోతున్న ఈ రాజతంత్రజ్ఞుడిని తొడ మీద కూర్చుండపెట్టుకొనగలనా?, తన కాలిజోడు రాముడి కాలిజోడుకి సరిపోయే వయసులో ఉన్న ఇతడిని కౌగలించుకొనగలనా? , అని యవ్వనంతో ఉట్టిపడుతున్న రాముడిని చూసి ప్రేమ ఉప్పొంగి, తనకు నమస్కరిస్తున్న కొడుకు చేతులని ఒక్కసారిగా తన చేతులలోనికి తీసుకొని, దశరథుడు ప్రేమగా ముద్దాడాడు. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యాకాండము, అభిషేక ఖండములోని ఈ పద్యం విశ్వనాధవారి చిత్రమైన కల్పనకు చక్కని ఉదాహరణ. ఇది చాలా సహజమైన లోకవ్యవహారం. పిల్లలు పెరిగి మనంత వారయినప్పుడు, వారిని దూరం నుంచి చూసి ఆనందిస్తాము, తల మీద చేయి వేసి ఆశీర్వదిస్తాము. చిన్నప్పుడు వారిని ముద్దాడినట్లు ముద్దాడలేము, కౌగిలించుకొనలేము. ఆ ప్రేమంతా మనసులోనే ఉంచుకుంటాము. ఇక లోకాభిరాముడైన కొడుకు విషయంలో, దశరథుని వంటి వాని ప్రేమ వ్యక్తీకరణకు అవధులుంటాయా? యవ్వనం ఉట్టిపడుతూ, ఆజానుబాహుడై, నీలవర్ణంతో మెరిసిపోతున్న రాముడిని ముద్దాడకుండా, కౌగిలించుకొనకుండ ఉండటం సాధ్యమా? కానీ, రాముని వయసు అడ్డమొస్తున్నది. అటు అవధులు లేని ప్రేమ, వాత్సల్యము. ఇటు లోకమర్యాద. ఈ రెండిటినీ పాటించాలి దశరథుడు. ఈ రెండిటినీ సాధించాలి మహాకావ్య రచనలో. అందుకని, దశరథుడు, అంజలి ఘటించిన రాముని చేతులను ముద్దాడినట్లుగా అద్భుతమైన కల్పన చేశారు విశ్వనాథ.
No comments:
Post a Comment