కుదురు సమస్త ధర్మములకున్ విను సత్యము; యోగమోక్ష స
త్పదములు సత్యకార్యములు; పాప మసత్యము కంటె నొండు లే
దు; దలప నశ్వమేధములు దొమ్మిది నూఱులు వెండి నూఱునై
యొదవిన నీడు గావు భరతోత్తమ! సత్యము తోడ నారయన్.
భీష్ముడు ధర్మరాజుకి సత్యం యొక్క స్వరూపాన్ని విడమరచి చెప్పాడు. అన్ని ప్రాణులను సమభావంతో చూడటం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ఎవరితో విరోధం లేకుండా ఉండటం, సిగ్గు పడటం, ధైర్యం కలిగి ఉండటం, ఈర్ష్య లేకుండా ఉండటం, ప్రాణులకు మంచి చేయడం, హింసకు పాల్పడకుండా ఉండటం, యజ్ఞయాగాదులు చేయడం, దానం చేయడం, క్షమాగుణాన్ని కలిగి ఉండటం, ఋజుప్రవర్తన కలిగి ఉండటం - ఇవన్నీ సత్యం యొక్క స్వరూపాలు. పూర్తిగా ధ్యానస్థితిలోకి వెళ్ళిన యోగికి ఇవి తేలికగా అలవడుతాయి.
కుదురు, పాదు అనేవి చక్కని తెలుగు పదాలు. మొక్కకు పోసిన నీరు బయటకు పోకుండా మొక్కకే అందాలంటే, మొక్క చుట్టూ కుదురు లేక పాదు త్రవ్వాలి. అదే విధంగా, లోకంలో ధర్మం నిలవాలంటే, సత్యం అనే పాదు వల్ల అది జరుగుతుంది.
మనకు ఎన్నో రకాల ధర్మా లున్నాయి. ఉదాహరణకి, లోక ధర్మం, సమాజ ధర్మం, గృహ ధర్మం, వ్యక్తి ధర్మం మొదలైనవి. ఈ అన్ని ధర్మాలు ఆచరింపబడాలంటే సత్యమే దానికి ఆధారం. యోగమోక్షాలు సత్యం వల్లనే సమకూరుతాయి. యోగము అంటే సమత్వం. సుఖదుఃఖాలు, శీతోష్ణాలు, మానావమానాలు వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండటం. మోక్షమంటే విడుదల లేక విముక్తి. అంటే, ఇహలోకంలో, అందరినీ ప్రేమిస్తూ, అందరిచేత ప్రేమింపబడుతూ ఆనందమయ జీవితం గడపటం. మోక్షమంటే, ఇక పుట్టుక అనేది లేని, భగవంతునితో ఒక్కటయ్యే స్థితి. కాబట్టి, యోగమోక్షాలు రెండింటికీ సత్యమే ఆధారం. యోగమోక్షాలు పుణ్యస్థానాలు. అసత్యాన్ని మించిన పాపం ఇంకొకటి ఉండదు. వెయ్యి అశ్వమేధయాగాల పుణ్యఫలం ఒక్క సత్యంతో సరితూగలేదు. అంటే, సత్యవాక్పరిపాలన, సత్కర్మాచరణ ఎంత గొప్పవో దీనివలన తెలుస్తున్నది
తిక్కన ఇక్కడ వెయ్యి అనడానికి తొమ్మిది నూఱులను ఇంకొక నూఱుతో కలిపి మొత్తం వెయ్యి అయ్యేటట్లు మనం చెప్పే గణితశాస్త్రంలోని కూడికను ఉపయోగించాడు. వెండి అంటే మళ్ళీ. తొమ్మిది నూఱులు వెండి ( మళ్ళీ ) నూఱునై - మొత్తం వెయ్యి.
భీష్ముడు ధర్మరాజుని ' భరతోత్తమ! ' అని సంబోధించాడు. ధర్మరాజు తన ధర్మాచరణతో భరతవంశానికి వన్నె తెచ్చిన వాడు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment