మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ !
శత్రుత్వంబున యుద్ధమున్ సలుపగా సైన్యంబుతో బాండవుల్
ధాత్రీనాధులు, మత్కుమారులును, ధర్మక్షేత్రమౌ యక్కురు
క్షేత్రంబందున మోహరించిరట యక్షీణక్రియాసిద్ధి సం
పాత్రంబౌగతి, నేమి జేసిరొకొ? చెప్పంబూనుమా సంజయా !
శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం మొడటి శ్లోకం, దానికి శ్రీ లొల్లా సుబ్బరామయ్యగారు చేసిన తెనుగుసేత ఇవి.
భగవద్గీతలోని మొదటి అధ్యాయానికి ' అర్జున విషాదయోగం ' అని పేరు. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది పాఠకులకు. విషాదం ఏ విధంగా యోగ మౌతుందని? నిజమే ! ప్రాపంచిక విషయాల కొరకు దుఃఖిస్తే అది విషాదంగాను, భగవంతుని కొరకు దుఃఖిస్తే, అది ఆర్తిగాను చెప్పబడుతుంది. అందువల్ల, అర్జునుని హృదయం నుండి బహిర్గతమైన విషాదం, భగవంతుడైన కృష్ణుని ముఖం నుండి గీతామృతధారలుగా వెలువడి, మానవాళి మనుగడకు మార్గదర్శకాలయ్యాయి. యోగము అంటే, అనుసంధానము, కలయిక లేక కూడిక. జీవాత్మ పరమాత్మల కలయికే యోగము. ఇందు అర్జునుడు జీవుడు, శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవబ్రహ్మైక్యానుసంధానమే భగవద్గీత పరమోద్దేశ్యం.
కురుక్షేత్ర మహాసంగ్రామ విశేషాలను సంజయుడు, వ్యాసమహర్షి కృపతో, చూసినది చూసినట్లు, ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు అడిగాడు:
" సంజయా ! ధర్మాక్షేత్రమైన కురుక్షేత్రంలో, నా వారైన దుర్యోధనాదులు, పాండురాజు కుమారులైన ధర్మరాజాదులు, యుద్ధ కౌతూహలంతో ఏమేమి చేసారో చెప్పు."
సంజయుడు అనగా ' సమ్యక్ జయం ' కలవాడు. ఇంద్రియములను బాగా నిగ్రహించినవాడు. అందువల్లనే, వ్యాసభగవానుని కృపతో, అర్జునకృష్ణ సంవాద రూపమైన భగవద్గీతను వివరించటానికి అర్హతను సంపాదించాడు.
భగవద్గీత మొదటి శ్లోకం ' ధర్మ ' శబ్దంతో ప్రారంభించబడ్డది. ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మము. ధర్మపరిరక్షణే కురుక్షేత్ర మహాసంగ్రామం ఉద్దేశ్యం. అందువల్లనే, కురుక్షేత్రం ధర్మక్షేత్రం. ధర్మపరిరక్షణ లోకకళ్యాణహేతువు. ఈ విధంగా, గీతాశాస్త్రము మంగళకరంగా ఆరంభించబడ్డది.
' మామకాః ' (నావారు) అన్న ది ధృతరాష్ట్రుని పక్షపాత బుద్ధిని తెలియజేస్తున్నది. " మమ (నాది) " అన్నది స్వార్థమని, దుఃఖహేతువని, ' న మమ (నాది కాదు) అన్నది త్యాగమని, మోక్షకారణమని, శ్రీకృష్ణుడు పంచమవేదమైన మహాభారతంలో చెప్పాడు.
ఈ మొదటి శ్లోకం గీతాసౌధానికి పునాది వంటిది.
No comments:
Post a Comment