ప్రియ మఱి అజ్ఞునేనియు దరిద్రుని నేనియు విప్రు గంద జే
త యుభయలోక సౌఖ్యములు దవ్వుగ జేయు, దదీయమైన నిం
దయు నను బెట్టు దిట్టుట, యధర్మత నాతని సొమ్ము పుచ్చికొం
టయును మదర్థముం గొనుట, దాపక చెప్పితి నిక్క మింతయున్.
మహాభారతంలో ప్రధానకథకు అనుసంధానంగా ఎన్నో ఉపాఖ్యానాలున్నాయి. అవి, పూర్వమెన్నడో ఒకరు చెప్పినవి ఇంకొకరు విని, వానిని మరొకరికి చెప్పడం చాలా చోట్ల కనిపిస్తుంది. మహాభారతంలో ఐదు జంటలు కథలు గాని, ఉపకథలను గాని చెప్పటం జరిగింది. వారు
వైశంపాయనుడు - జనమేజయుడు
భీష్ముడు - ధర్మరాజు
నారదుడు. - కృష్ణుడు
శివుడు - పార్వతి
ఇంకొక జంట కూడా ఉంది.
సూతుడు - శౌనకాది మునులు
పార్వతి వర్ణాశ్రమ ధర్మాలను గురించి శివుడిని అడిగింది. శివుడు పార్వతికి చెప్పిన దానిని నారదుడు కృష్ణుడికి చెప్పిన విషయాన్ని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడని శూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. ఇదీ సమన్వయం.
పరమేశ్వరుడు పరమానందభరితుడై, ముందుగా బ్రాహ్మణులను గురించి చెప్పటం మొదలుపెట్టాడు.
అతడి మీద కోపంతో గాని, అమాయకుడైన వాడిని గాని, దారిద్ర్యంతో కష్టాలు పడుతున్నవాడిని కానీ, బ్రాహ్మణుడిని బాధించేవారు ఇహపర సౌఖ్యాలకు దూరమవుతారు. అంతేకాదు, బ్రాహ్మణదూషణ శివదూషణ అని కూడా చెప్పాడు. అన్యాయంగా, బ్రాహ్మణుడి సొమ్ము కాజేయడం, తన సొమ్ము కాజేసినట్లేనని చెప్పాడు. ఇందులో ఏమీ దాచకుండా ఉన్నదున్నట్లు సత్యాన్ని చెప్పానన్నాడు శివుడు పార్వతితో.
మన పెద్దవాళ్ళు, శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడనుంచి ఏమీ పట్టుకురాకూడదని చెప్పేవారు. చివరికి, విభూతి కూడా. మరి అటువంటప్పుడు, బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం, శివుని సొమ్ముని కాజేయడమేనంటే, అది ఎంత పాపహేతువో అర్థమౌతుంది.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధము, నృగోపాఖ్యానంలోని " విప్రతతి సొమ్ము కంటెను విషము మేలు " అన్న సూక్తి కూడా జనబాహుళ్యంలో బాగా పాతుకుపోయింది.
సంఘంలో, పూర్వం బ్రాహ్మణుడి కున్న గౌరవమర్యాదలను గురించి తెలియజేసే ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, పంచమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment