నందము బొంది నిర్భయమునన్ శయనింతురె? యిట్లు వంటయిల్
కుందెలు సొచ్చె; వేగ చని కోమలి ! వారల జంపి తెచ్చి నా
కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మాంస ఖండముల్.
భీమసేనుడు రహస్య సొరంగ మార్గం నుండి తల్లిని, అన్నదమ్ములను అడవిలోనికి తీసుకువచ్చాడు. వారిని అక్కడ నేలపై పడుకోబెట్టి, దగ్గరలో ఉన్న ఒక కొలను వద్దకు వెళ్ళి వారి కోసం నీళ్ళు తీసుకువచ్చాడు. అదే ప్రాంతంలో మద్దిచెట్ల నడుమ హిడింబుడు అనే రాక్షసుడు ఉంటున్నాడు. ఆ చెట్లనడుమ నుండి వీరిని చూసాడు. వాడికి హిడింబ అనే చెల్లెలు ఉంది. హిడింబుడు నరమాసం తిని చాలా రోజులైంది. అందుకని చెల్లెలితో ఇలా అంటున్నాడు:
" ఈ ప్రాంతంలోకి మనుష్యులు ఎప్పుడూ రారే ! ఒకవేళ వచ్చినా, భయం లేకుండా ఇట్లా హాయిగా నిద్ర పోతూ ఉంటారా? ఏది ఏమైనా కుందేలు వంటింట్లోకి వచ్చింది. తొందరగా వెళ్ళి వాళ్ళను చంపి, ఆ రుచికరమైన మాసం ముక్కలను తెచ్చి నాకు చక్కగా వండి పెట్టు. "
శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వం, షష్ఠాశ్వాసం లోని యీ పద్యం నన్నయగారి పాత్రోచిత సంభాషణారచనకు ఒక చక్కని ఉదాహరణ.
" ఏది కావాలనుకుంటామో, దానంతట అదే వచ్చింది " అని చెప్పడానికి " వంటయిల్ కుందెలు సొచ్చె " అనే జాతీయాన్ని వాడి పద్యానికి ఒక అందాన్ని తెచ్చిపెట్టారు.
No comments:
Post a Comment