జనవర ! పాండుభూపతనుజాతుడు దుస్తరమౌ మనోరథా
బ్ధిని సరసీరుహాక్షుడను తెప్ప కతంబున దాటి భూరి శో
భనయుతుడై మనోరుజయు బాసి ముదాత్మకుడై వెలింగె న
వ్వనరుహనాభుదాసజనవర్యులకుం గలవే యసాధ్యముల్?
ధర్మరాజు రాజసూయయాగం పూర్తిచేసాడు. యాగానికి వచ్చిన వారందరినీ సముచిత రీతిలో సత్కరించాడు. శ్రీకృష్ణుడు కూడా యాదవుల నందరినీ కుశస్థలికి పంపించి, కొద్దిమంది పరివారంతో, ధర్మరాజు సంతోషం కోసం ఇంద్రప్రస్థంలో కొంతకాలం ఉన్నాడు. ఈ వృత్తాంతాన్ని పరీక్షిన్మహారాజుకు సవివరంగా చెప్పి, శుకమహర్షి ఇంకా ఇట్లా అన్నాడు:
" ఓ పరీక్షిన్మహారాజా ! పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు కష్టతరమైన రాజసూయ యాగం చేయాలనే సముద్రమంతటి కోరికను, శ్రీకృష్ణుడు అనే తెప్ప సహాయంతో దాటి, తన మనోవ్యథకు దూరమై, గొప్ప ఐశ్వర్యంతో, సంతోషంతో వెలుగొందాడు. శ్రీకృష్ణుడి భక్తులకు అసాధ్య మనేది ఉన్నదా? "
భగవంతుడు ఆర్తత్రాణపరాయణుడు. శరణాగతి నొందినవారిని కంటికి రెప్పలా కాపాడతాడు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధములో ఉన్నది.
No comments:
Post a Comment