బొమవిలు చూపుతూపులును బూని మృగాంకుని గెల్చి యింతిమో
మమృతము మందహాసమున నచ్చపుడాలు కపోలలీల ఫా
లమున గలావిలాస మఖిలంబు గొనం గని వెన్క జొచ్చె న
య్యమృతగభస్తిభీతతిమిరావళి వేనలి పెంపు సొంపునన్.
ఇది చాలా అందమైన పద్యం.
వసురాజు గిరికాదేవి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. ఆమె కనుబొమలు వంగి ధనుస్సులాగా ఉంది. కంటిచూపులు బాణాలలాగా ఉన్నాయి. అటువంటి ఆయుధసంపత్తితో ఆమె చంద్రుణ్ణి గెలిచిందట. గెలిచినవారు, ఓడినవారి సంపదను కొల్లగొడతారు కదా ! ఆమె చంద్రునిలో ఉన్న అమృతాన్ని తన చిరునవ్వులోను, నిర్మలమైన కాంతిని చెక్కిళ్ళలోను, చంద్రఖండము యొక్క డంబము నొసటిలోను దాచినదట. ఇది చూసి భయపడిన చీకటి, గిరికాదేవి వెనక దాగికొన్నదట. కాంతికి శత్రువు చీకటి కదా ! శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు, చీకటి గిరికతో మైత్రి నెరపి, ఆమె వెనుక దాక్కుంది. ఆమె జడలో దాక్కుందట. అంటే గిరికాదేవి జడ అంత నల్లగా ఉంది అని అర్థము.
భట్టుమూర్తి కల్పనా చమత్కృతికి వసుచరిత్రము, ద్వితీయాస్కంధములోని యీ పద్యం కూడా ఒక చక్కని నిదర్శనం.
No comments:
Post a Comment