జ్ఞానదాయి, యట్లుగాన తనువు
నోమవలయు మర్త్యు డేమిటి నేమఱ
కాత్మహితము గోరి యనఘచరిత !
తన సత్వమును బలంబును తన కయ్యెడు
కాలము నారయగా దలంప
డాహారముల గొను నవియును నగునవి
గానివి యను వివేకంబు బుద్ధి
జొనుపడు బహుళభోజన మొక్క మరి సేయు
నొక మరి దుర్నిష్ఠ నుపవసించు
గతకాలమును నపక్వంబును గురుదుష్ట
విషమవిరుద్ధము విపులరసము
నైన యన్నము దా నరయక భుజించు
గుడుపుపై గుడ్చు దిననిద్ర గూరు సురత
పరత నొందు బెల్లాయాసపడు విమూఢు
డతని బాధించు దోషత్రయంబు గెరలి.
అర్జునుడు శ్రీకృష్ణుడిని కురుక్షేత్ర సంగ్రామకాలంలో చేసిన గీతాబోధను మరొకసారి చేయమని అడిగాడు. దానికి కృష్ణుడు, మహావాక్యాలు వాటంతట అవి బయటపడతాయి తప్ప, అవి మాటిమాటికీ చెప్పడానికి వీలుకాదని చెప్పాడు. అయినప్పటికీ, అర్జునుని జిజ్ఞాసను చూసి, ఒక బ్రాహ్మణుడు, సర్వమూ పరిత్యజించిన ఒక సిద్ధుని వద్ద ఉపదేశము పొంది, కాశ్యపుడనే వానికి చెప్పిన వేదాంత మహావాక్యాలను, కృష్ణు డిప్పుడు చెబుతున్నానన్నాడు.
" ఏ పుణ్యకార్యం చేయాలన్నా దానికి శరీరం అవసరం. అందుకని శరీరా న్నెప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. శరీరాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకొని ధర్మాన్ని ఆచరిస్తే, ఆ ధర్మం మోక్షాన్ని కలుగజేస్తుంది. "
అందుకనే పెద్దలు, " శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం " అన్నారు.
" అవివేకియైనవాడు, తన శరీరస్థితిని, శక్తిని, కాలాన్ని, గుర్తించకుండా ఆహారాన్ని ఎప్పుడుపడితే అప్పుడు తీసుకుంటుంటాడు. తినే ఆహారం తన వంటికి పడుతుందా పడదా అనే ఆలోచన లేకుండా తింటుంటాడు. తింటే విపరీతంగా తింటాడు, లేకపోతే కటిక ఉపవాసం ఉంటాడు. నిలవ ఉంచిన ఆహారం, సరిగా ఉడకనివి, పదార్థ దోషమున్న వాటిని, విరుద్ధ గుణాలు కలిగిన వాటిని, ఏ ఋతువుల్లో ఏమేమి తినాలో వాటిని తినకుండా, మరీ పలచగా ఉన్నవాటిని, వాటి మంచి చెడులు పట్టించుకోకుండా తింటాడు. మళ్ళీ మళ్ళీ తింటాడు. తినంగానే నిద్రపోతాడు. తినంగానే మైథునంలో పాల్గొని ఆయాసపడతాడు. వీటన్నింటి వల్ల వాత, పిత్త, శ్లేష్మాలు శరీరాన్ని ఆవహించి బాధిస్తాయి. "
ఎప్పుడో ద్వాపర కలియుగాల సంధికాలంలో చెప్పిన ఈ మాటలు ఇప్పటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పాశ్చాత్య నాగరికత ప్రభావానికి లోనై, ముఖ్యంగా యువత, ఆహారవిహారాదుల విషయంలో మంచి అలవాట్లకు దూరమౌతున్నది. సందర్భం కాబట్టి ప్రస్తావించటం జరుగుతున్నది. ఈ నాటి కరోనా విలయతాండవానికి, మానవాళి ఆహారపుటలవాట్లు కూడా ఒక కారణమని తెలుసుకోవాలి. పెద్దల మాట చద్దిమూట అని గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment