పరమార్థ ప్రతిభ దమో
హరి నచ్యుతు భీష్ము డెఱిగి నట్లెఱుగగ నీ
కరిది శిశుపాల ! పెద్దల
చరితం బల్పులకు నెఱుగ శక్యమె యెందున్?
గురు డని సమస్త లోకో
త్తరుడని నీ కంటె వృద్ధతములైన నరే
శ్వరు లచ్యుతు నర్చన నెడ
గర మభినందింప నీకు గాదన నగునే
భగవంతుడైన శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయడాన్ని వ్యతిరేకించి, దైవదూషణకు పాలుబడ్డ శిశుపాలునితో, హితవాక్యాలు పలుకుతున్నాడు ధర్మరాజు.
" తమస్సు అంటే అజ్ఞానం అనే చీకటి. ఆ చీకటిని పోగొట్టాలంటే వెలుగు కావాలి. ఆ వెలుగే, పరమార్థతత్త్వాన్ని దర్శించగలిగే ప్రతిభ. ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలుసుకొనగలిగే ప్రతిభ. ఆ ప్రతిభ పేరు వివేకము , జ్ఞానము. అట్టి ప్రతిభను ప్రసాదించేవాడు పరమాత్ముడు, అచ్యుతుడు, అయిన శ్రీకృష్ణుడు. అది భీష్ముని వంటి మహాత్ములకు అర్థమైనట్లు వివేకశూన్యులకు ఎట్లా అర్థమవుతుంది?
శ్రీకృష్ణుణ్ణి గురువని, లోకోత్తరుడని, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు ప్రస్తుతించి, అచ్యుతుని అగ్రపూజకు అర్హుడని అభినందిస్తుంటే, నీవు కాదనడం భావ్యమా? "
శ్రీకృష్ణుడు, యోగయోగీశ్వరుడు, జగద్గురువు. ఆయన పరబ్రహ్మ స్వరూపం. నిత్యుడు. నన్నయ సాభిప్రాయంగా వాడిన " గురుడు, లోకోత్తరుడు, అచ్యుతుడు" అనే పదాలు, శ్రీకృష్ణుని పరమాత్మ తత్త్వాన్ని, వ్యాపకత్వాన్ని, నిత్యత్వాన్ని ధ్వనింపజేస్తున్నాయి. శ్రీకృష్ణుణ్ణి అగ్రపుజార్హుడని నిర్ణయించినవాడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయిన భీష్ముడు. అటువంటి జ్ఞానవృద్ధుని మాటలను వ్యతిరేకించటం వివేకం కలవారు చేయరు. కానీ, శిశుపాలుడు ఆ పని చేశాడు. అంతేకాదు భగవంతుడైన శ్రీకృష్ణుడిని పశుపాలుడని నిందించాడు. అటువంటి వివేకహీనునికి, ధర్మరాజు మాటల ఆంతర్యం, లోతు ఏమర్థమౌతాయి? అందుచేత, ధర్మరాజు సంబోధన
'శిశుపాల ! ' అన్నది, సాభిప్రాయమని, అతనిది పిల్లచేష్ట అన్న వ్యంగ్యార్థం గోచరమౌతుంది.
పై రెండు చిన్న పద్యాలలోని వాక్యవిన్యాసం, ' నానారుచిరార్థసూక్తినిధిత్వం (రుచిరమైన అర్థాలను కలిగిన పద సంపద) పరిశీలిస్తే, అలతి పదాలలో అనల్పార్థాలను నన్నయగారు ఏ విధంగా ధ్వనింపజేస్తారో అర్థమౌతుంది.
ఈ రెండు అందమైన కందాలు శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉన్నాయి.
No comments:
Post a Comment