చింతాపరత్వంబున జెందు దుఃఖా
క్రాంతత్వ ముర్వీశ్వర! కాన గీడుం
జింతింప డార్యాత్ము డచింతనుండై
యంతఃపరీతాపము నార్ప జాలున్.
ప్రియవస్తు వెడలుటయు న
ప్రియంబు వాటిల్లుటయు బరిజ్ఞాన విని
శ్చయ హీనులైన యల్పా
శయులకు ' దుఃఖంబు జేయు ' జగతీనాధా!
కురుక్షేత్రమహాసంగ్రామంలో దుర్యోధనాదులందరూ మరణించిన వార్త విని ధృతరాష్ట్రుడు దుఃఖానికి లోనయ్యాడు. సంజయుడు యదార్థాన్ని వివరించినా అతని మనసు ఊరట చెందలేదు. అప్పుడు ధర్మవిదుడైన విదురుడు, ద్వంద్వాలకు అతీతుడిగా ఉండటాన్ని గురించి, నిత్యానిత్యవివేకాన్ని గురించి తత్త్వాన్ని తెలియజేసాడు.
చింతనం అనేది మానవుని దుఃఖానికి కారణం. చింతనం అంటే ఆలోచించటం. అంటే లౌకిక సంబంధాలను గురించి ఆలోచించడం. ' నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు ' అనే ఆలోచనలు. ఇవి దుఃఖహేతువులౌతాయి. అదే, చింతనను భగవంతుడి వైపుకి మరలిస్తే అది స్మరణ అవుతుంది. అది జీవుడిని బంధవిముక్తుడిని చేస్తుంది. అందువల్ల జ్ఞాని దుఃఖిస్తూ కూర్చోడు. అంతర్ముఖుడై, తనలో ఉన్న దుఃఖాగ్నిని, వివేకమనే జలంతో ఆర్పివేస్తాడు.
ఇక్కడ తిక్కనగారు ' అచింతనుడు ' అనే పదాన్ని వాడారు. అంటే చింతన లేనివాడు. చింతన లేనప్పుడు, దాని స్థానంలో ' కార్యశీలత ' వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడు? ఆర్యాత్ముడైనప్పుడు, శుద్ధాత్ముడైనప్పుడు, ధీరాత్ముడైనప్పుడు.
భగవద్గీతలో కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుని విషాదాన్ని " అనార్యజుష్టం " అన్నాడు. అంటే, అది బుద్ధిమంతుల, జ్ఞానుల మార్గం కాదని, పామరజనం, మూర్ఖుల మార్గమని కృష్ణుని ఉద్దేశ్యం.
ఇక విదురుడు సాధారణ మానవులకి, బుద్ధిమంతులై నిత్యానిత్యవస్తు వివేకం కలిగినవారికి గల భేదాన్ని చక్కగా వివరించాడు. మామూలు అవగాహన మాత్రమే ఉన్న సామాన్య మానవులు తమకు ప్రియమైనవి నశిస్తే శోకిస్తారు. అదే జ్ఞానులు ఆ పని చేయరు. వారికి నిత్యానిత్యవస్తు పరిజ్ఞానము ఉంది కనుక . ' బ్రహ్మ నిత్యం, జగన్మిథ్య ' అని ఎఱుక కలిగినవారు కనుక.
ఈ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, స్త్రీ పర్వము, ప్రథమాశ్వాసానికి డాక్టరు.హెచ్.ఎస్.బ్రహ్మానంద గారు చక్కని వ్యాఖ్య వ్రాసారు. అది ఇక్కడ పొందుపరుస్తున్నాను.
" తిక్కన ' మహాశయ ' శబ్దం నుండి ' అల్పాశయ ' శబ్దాన్ని పుట్టించాడు. మహాశయులంటే సమగ్రజ్ఞానవంతులని అర్థం. వారి ఆశయాల పరిధి విశ్వజనీనంగా ఉంటుంది. అల్పాశయులు కుల, కుటుంబ, జీవిత పరిధిలో బ్రతుకుతూ ఉంటారు. అట్లాంటివారికి ఏ చిన్న ' వస్తువు ' పోయినా, ఎంత చిన్న సంకట పరిస్థితి వచ్చినా ఏడుస్తూ కూర్చుంటారు. మహాశయులు ఇట్లాంటి సందర్భాలలోనే ధైర్యం వహిస్తారు.
జ్ఞానం కంటె విజ్ఞానం, దానికంటె పరిజ్ఞానం చాలా గొప్పది. పరి - అంటే సమగ్రమైనదని అర్థం. భారత తాత్పర్యం ' ఎఱుకను సమగ్రం చేయటం ' . ఆత్మజ్ఞానమే సమగ్ర జ్ఞానం. పదార్థజ్ఞానం విజ్ఞానం కావచ్చునేమో కానీ పరిజ్ఞానం మాత్రం కాదు. కాబట్టి వస్తునాశం, అప్రియ సందర్భం - ఇవన్నీ తాత్కాలికాలు అనే నిశ్చితబుద్ధి పరిజ్ఞానంచేతే కలుగుతుంది. "
దుఃఖోపశమనం కోసం, ధృతరాష్ట్రుడికి విదురుడు చేసిన యీ తత్త్వబోధ శ్రీమదాంధ్ర మహాభారతము, స్త్రీ పర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment