కనుగవ పూర్ణకామ మగు, కన్గవ కన్నను బూర్ణ కామమై
మన మతిచిత్తవృత్తి యగు, మానసవృత్తికి మున్న చిత్ర మై
తనువు రసోత్తరంగ మగు, ద త్తనువైఖరి కన్న సంభ్రమం
బెనసి రసోత్తరంగ మగు నీప్సిత మా నగమానభేదికిన్.
వసురాజు ప్రియసఖుడు చెట్లచాటు నుండి గిరిక సౌందర్యాన్ని చూసాడు. ఆమె సౌందర్యం గురించి విన్న తరువాత, వసురాజు ఆమెను చూడటానికి ఉవ్విళ్ళూరాడు. చివరకు, నవరత్నస్థగితమై ప్రకాశిస్తున్న ఒక దివ్యమందిరంలో ఆమెను చూసాడు. కళ్ళకి విందు చేసినటువంటి గిరికాసౌందర్యాన్ని వీక్షించిన వసురాజు చిత్తవిభ్రమాన్ని వర్ణించేదే యీ పద్యం. ఈ పద్యం రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రము, ద్వితీయాశ్వాసంలో ఉంది.
' ఆ నగమాన భేదికిన్. ' కోలాహలపర్వతం గర్వాన్ని అణచిన వాడు వసురాజు. అటువంటి వసురాజుకి, గిరికను చూడగానే నయనోత్సవమయింది. కనులకు కోరిక తీరినట్లయింది. సంకల్పసిద్ధి చెందిన కనుల కంటె, వసురాజు మనస్సు అత్యద్భుతమైన ప్రవృత్తులకు లోనయింది. అత్యద్భుతమైన చిత్తప్రవృత్తులకి లోనయిన మనస్సు కంటె, ఆయన శరీరం రసోత్తరంగమయింది. శరీరంపై స్వేదం పొడసూపింది. తనువు, ఒక బొమ్మలాగా చేష్టారహితమయింది. చేష్టారహితమైన శరీరం కంటె, ఆమెను ఎప్పుడెప్పుడు కలిసి మాట్లాడాలా అన్న అభిలాష, ఆమెపై అనురాగం అతిశయించింది, ఎక్కువయింది.
" తనువు రసోత్తరంగ మగు " అంటే మేనిపై స్వేదబిందువులు ఉద్భవించటం. ఇది శృంగారభావం. " రసోత్తరం బగు నీప్సితము " అంటే అనురాగం అతిశయించటం, ఎక్కువవడం. ఈ విధంగా, చూడటమనే ప్రథమదశ నుండి, ఆమెను కలుకోవాలనే అభిలాష, అనురాగం అతిశయించడం వరకు ఒక క్రమపద్ధతిలో, వసురాజు మనస్సును, పద్యాన్ని నడిపించాడు మహాకవి భట్టుమూర్తి.
No comments:
Post a Comment