వనితా ! చూచితె మాల్యవంతము ప్రభావంతంబు నానామణీ
జనకోదంచిత సానుకాంతము మరుత్సంపూర్ణచంద్రాననా
జనకేళీపదచంద్రకాంతము నభస్సంబాధకృత్కూటవ
ర్థనదుర్ధాంతము సర్వపర్వతకథాప్రాగ్వర్ణితోదంతమున్.
ఈ పద్యం తెనాలి రామకృష్ణుని ' పాండురంగ మాహాత్మ్యము ' అనే ప్రబంధము, ప్రథమాశ్వాసం లోనిది. " పాండురంగవిభుని పదగుంఫనము " అని, తెనాలివాని పదముల కూర్పునకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పద్యం కూడా, దీర్ఘసమాసాలతో, మటిమాటికీ చదవాలనిపిస్తుంది. రామకృష్ణుని పదవిన్యాసం మరి అటువంటిది.
అగస్త్యుడు, భార్య లోపాముద్రతో పాటు, కొల్హాపురి లక్ష్మీదేవిని దర్శించుకొని, మాల్యవంతపర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అగస్త్యుడు మాల్యవంతం గొప్పతనాన్ని వివరిస్తున్నాడు.
" ఓ లోపాముద్రా ! ఈ మాల్యవంతాని చూసావా? మంచి కాంతితో ప్రకాశిస్తూ ఉంది. ఈ కొండచరియలన్నీ అనేకమైన మణులతో పొదగబడి ఉన్నాయి. చంద్రుని వంటి ముఖం కలిగిన అందమైన దేవతాస్త్రీలకు క్రీడాస్థలమైన చంద్రకాంత శిలలు కలిగి ఉంది. ఈ పర్వతశిఖరాలు ఆకాశా న్నంటుతూ, అణచడానికి శక్యం కాకుండా ఉన్నాయి. పర్వతాల ప్రసక్తి వచ్చినప్పుడు, ముందు ఈ పర్వతము గురించి చెప్పకుండా ఉండలేము."
పద్యం మొత్తం దీర్ఘసమాసయుక్తమై ఉండటం వల్ల, పర్వతము యొక్క విశిష్టత, ఆధిక్యత వ్యక్తమౌతున్నది.
ఈ పర్వతము పూలదండ ఆకారంలో ఉండటం వల్ల దీనికి ' మాల్యవంతము ' అనే పేరు వచ్చింది. సంస్కృతంలో మాల్యము అంటే పూలదండ. దీనినే క్రౌంచపర్వతము అని కూడా పిలుస్తారు.
No comments:
Post a Comment