అనవుడు నాత డిట్లనియె నాతనితో " నిపు డేను దీని నీ
జనపతిచేత ధారగొని సాధుగతిం జన నీది యంట " యె
ట్లనిన " నతండు " నేనును ధరాధిపుచే మును ధారగొన్న యా
వని " వినిపింప నిద్దఱకు నయ్యె నపార వివాద మచ్చటన్.
" మనుజేంద్రోత్తమ! వంశపావన! జగన్మాన్యక్రియాచార! నీ
ఘన దానక్రతుధర్మముల్ త్రిభువనఖ్యాతంబులై చెల్లెడిన్
మును దుష్కర్మఫలంబు నొంది పిదపం బుణ్యానుబంధంబులై
చను సౌఖ్యంబుల బొందు, పద్మజునియాజ్ఞం ద్రోవగా వచ్చునే?
" నరనాథకుల కాననము దహించుటకును
నవనీసురుల విత్త మగ్నికీల
జననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప
బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు
పార్థివోత్తముల సంపచ్ఛైలముల గూల్ప
భూసురధనము దంభోళిధార
జగతీవరుల కీర్తిచంద్రిక మాప వి
ప్రోత్తము ధనము సూర్యోదయంబు
విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు
గరళమునకును బ్రతికృతి గలదు గాని
దాని మాన్పంగ భువి నౌషధములు లేవు
గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి.
" ఓ పుణ్యాత్ముడా! అంతకుముందు నేను కశ్యపుడనే బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చిన ఆవు తప్పిపోయి తిరిగివచ్చి నా ఆవులమందలో కలిసింది. ఆ విషయం తెలియక నేను ఆ గోవును ఇంకొక బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాను. దానం పుచ్చుకొన్న బ్రాహ్మణుడు గోవును తోలుకొనివెళ్తుంటే, అంతకుముందు నా వద్ద దానం పుచ్చుకొన్న కశ్యపుడు ఆ గోవును చూసాడు. దానితో, కోపమొచ్చిన కశ్యపుడు, దొంగతనంగా అతడు తన ఆవును తీసుకు వెళ్తున్నాడని ఆరోపణ చేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తను ఆ ఆవును రాజుగారి దగ్గర దానం పుచ్చుకొన్నానని చెప్పాడు. చివరకు వివాదం రాజుగారి దగ్గరకే వెళ్ళింది. తెలియక జరిగిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా, లక్ష గోవులను దానమిస్తానన్నా ఇద్దరూ ఒప్పుకొనలేదు. మరణానంతరం, నన్ను యమకింకరులు యమధర్మరాజు ముందు నిలబెట్టారు. నన్ను చూసి సమవర్తి యిట్లా అన్నాడు.
" ఓ మహారాజా! నీవు చేసిన దానాలు, యజ్ఞాలు త్రిలోకపూజ్యాలు. అయితే, నీవు చేసిన పాపఫలాన్ని ముందు అనుభవించాల్సి ఉంటుంది. ఆ తరువాత నీకు ఎనలేని స్వర్గసౌఖ్యాలు ఒనగూరుతాయి. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఎవరికైనా దాటలేనిది కదా! "
ఈ విధంగా యమధర్మరాజు చెప్పగానే నన్ను భూమి మీదకి త్రోసివేసారు. నేను ఊసరవెల్లిగా ఈ పాడుబావిలో పడ్డాను. ప్రాణులు తమ పుణ్యపాప ఫలాలను అనుభవించి తీరవలసిందే. తప్పదు. ఇదిగో, ఈ రోజు నీ కరస్పర్శ చేత నాకు శాపవిముక్తి కలిగింది. ఈ కథను చెప్పటం పూర్తికాగానే, ఒక దివ్యవిమానం అక్కడకు వచ్చింది. అందులో నృగుడు స్వర్గానికి చేరుకున్నాడు. ఆ తరువాత, అందరూ వినేటట్లు మాధవుడు ఈ విధంగా చెప్పాడు.
" రాజవంశం అనే అడవిని దగ్ధం చేసే మహాగ్నిజ్వాల బ్రాహ్మణుల ధనము. జనపతుల ఐశ్వర్యం అనే సముద్రాన్ని ఇంకించే బడబానలం బ్రాహ్మణుల ధనం. రాజుల సంపద అనే పర్వతాల పాలిట వజ్రాయుధం బ్రాహ్మణుల ధనం. భూపతుల యొక్క కీర్తి అనే వెన్నెలను రూపుమాపే సూర్యోదయం విప్రోత్తముల ధనం. ఇంత ఎందుకు? బ్రాహ్మణుల ధనంకంటె విషం మేలు. విషానికి విరుగుడు ఉంది కాని, బ్రాహ్మణ ధనాపహరణ అన్న పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి, బ్రాహ్మణుల సొమ్ము అపహరించడం మంచిది కాదు అని భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. అంతేకాకుండా, తెలియక బ్రాహ్మణుల సొమ్ము అపహరించినా శిక్ష తప్పదని, తెలియక నిప్పును ముట్టుకొంటే కాలదా? అని సోదాహరణంగా చెప్పాడు.
ఇప్పటికీ, పల్లెటూళ్ళలో పెద్దవాళ్ళు ' అయ్యగారూ! బ్రామ్మల సొమ్ము తింటే పాపమండీ! ' అని హెచ్చరిక మాటలు చెబుతుంటారు. వర్తమాన సమాజంలో, అది బ్రాహ్మణుల ఆధిక్యత కంటె, ఆ తరంవారి ధర్మగుణాన్ని, సంస్కారాన్ని తెలియజేస్తుంది.
ఈ నృగోపాఖ్యానం శ్రీమదాంధ్ర మహాభాగవతము దశమస్కంధంలో ఉంది. ఈ కథను చదివినవారు, విన్నవారు, లౌకిక సుఖాలను పొందటమే గాక, మోక్షం కూడా వారికి అరచేతిలో ఉసిరికాయలాగా సిద్ధిస్తుందని శ్రీశుకుడు పరీక్షిన్మహారాజుకు చెప్పాడు.
No comments:
Post a Comment