బాధిత శత్రు వర్గు లగు పాండుకుమారుల దుఃఖవార్త మ
ర్త్యాధములైన సౌబలదినాధిపసూనుల యొద్ద నప్డు దు
ర్యోధను డాదిగాగ సుతులున్న సభన్ విని దుఃఖితాత్ముడై
యా ధృతరాష్ట్రు డా వఱచి నట్లఱచెన్ వివిధప్రలాపుడై.
హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు సభ తీరి ఉన్నప్పుడు, ఒక వార్త అక్కడకు చేరింది. ఆ సభలో నీచులైన దుర్యోధనుడు, అతడి సోదరవర్గం, శకుని, కర్ణుడు అంతా ఉన్నారు. దుర్యోధనుడిచే బాధింపబడిన అతని శత్రువులు, అంటే, పాండవులు, మరణిoచారన్న వార్త వచ్చింది. అది విన్న ధృతరాష్ట్రుడు దుఃఖంతో, వివిధ రకాలైన భావాలు వచ్చేటట్లు, ఆవు అరచినట్లు అరిచాడు.
మహాభారతంలో ధృతరాష్ట్రుడి మనస్సును పట్టుకోవడం చాలా కష్టం. పై వ్యాఖ్యకు భారతంలో పలు సన్నివేశాలు దృష్టాంతాలుగా నిలుస్తాయి. అయితే, అతని సముఖంలో ఉన్నవారికి గాని, చదువరులకు గాని అర్థం కానీ విషయం అతడి మనసులో నిగూఢంగా ఉన్న భావాలు. పాండవులను వారణావతానికి పంపించడంలో దుర్యోధనుడు తండ్రిపై తీసుకువచ్చిన ఒత్తిడే కారణం. ఇంత ఒత్తిడి తెచ్చిన తన కొడుకు, ఏదో ఒక మాయోపాయం చేసి పాండవులకు కీడు తలపెట్టకుండా ఉంటాడని అనుకోవడానికి ఆస్కారం లేదు. అందువల్ల, అతడి దుఃఖప్రకటన లోని వివిధ భావాలు, యదార్థమా లేక చూసేవారి కోసమా అన్న సందేహం సంజయుడు, విదురుడు, భీష్ముడులాంటి వారికే కాక పాఠకులకు కూడా రావడంలో ఆశ్చర్యం లేదు.. ఏది ఏమైనా, ధృతరాష్ట్రుడు పెద్దగా, దూడను కోల్పోయిన ఆవు ఎట్లా అరుస్తుందో అట్లా అరిచాడు. వత్సను కోల్పోయిన గోవు అరుపులో వాత్సల్యంతో కూడుకున్న బాధ ఉంటుంది. తిక్కనగారు ధృతరాష్ట్రుడి దుఃఖాన్ని వాత్సల్యానికి మారుపేరయిన ఆవు అరపుతో పోల్చడం మూలంగా, తమ్ముడి కొడుకుల మీద అది సహజమైన వాత్సల్యమా లేక ధృతరాష్ట్రుడి మానసిక అంధత్వం తెలిసిన తేట కాబట్టి, అది తెచ్చిపెట్టుకొన్న దుఃఖమా అన్న సందేహం కలుగుతుంది.
ఇంకొక విషయం. ' మర్త్యాధములు ' అన్న పదం తిక్కనగారు సాభిప్రాయంగా వాడారు. మానవత్వం లేని నీచ ప్రవృత్తి కలిగినవారు. అటువంటి వారే సజీవదహనం చేయగలుగుతారు.
సౌబలుడు అంటే గాంధార రాజు సుబలుడి కొడుకు శకుని. దినాధిపసూనుడు, సూర్యనందనుడైన కర్ణుడు.
పాఠకుల మెదడుకు పనిపెట్టే ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, షష్ఠాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment