ఎఱ మలుసంజవెల్గు లవి యెక్కిన మై సగమైన నీవ యి
ద్దఱివలె గానిపింతువు గదా యఱమై బ్రియురాలు క్రుమ్మెనాన్
గరితకు వార్త పుచ్చుటకు గాని భవాదృశు గంట యన్న న
బ్బురమున కంటె నబ్బురము పొందిన సంగతి రాజహంసమా!
" ఓ రాజహంసా ! సాయంసంధ్య ఎఱ్ఱని కాంతులు నీ రెక్క మీద పడి, నీవు ఇద్దరి వలె కనిపిస్తున్నావు. నీ శరీరంలో సగభాగాన్ని నీ ప్రియురాలు ఆక్రమించుకొన్నట్లు కనపడుతున్నది. అందువల్ల, నా ఇల్లాలికి సమాచారం చేరవేయటానికి నీ వంటి వాడు దొరకటం ఆశ్చర్యం కాక మరేమవుతుంది ! "
సాయంసంధ్యలో ఆకాశం అరుణకాంతులు చిమ్ముతూ ఉంటుంది. ఆ ఎఱ్ఱని కాంతులు హంస కుడిరెక్కపై పడి అర్థనారీశ్వర తత్వాన్ని తలపిస్తున్నది. శివుని దక్షిణపార్శ్వం అమ్మవారు. హంసను చూసిన క్షణం నుంచి రామునికి, శివుడే హంస రూపంలో తన వియోగ బాధను జానకికి తెలియచేయడనికై యీ రూపంలో వచ్చాడా అని అనిపిస్తున్నది..
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధకాండము, సంశయ ఖండము నందలిది.
శ్రీనాథ కవిసార్వభౌముడు శృంగారనైషధ కావ్యంలో హంస నలదమయంతుల మధ్య రాయబారం నెరపడాన్ని చూపాడు. విశ్వనాథ ఇంకొక మెట్టు పైకెక్కి శివభక్తుడైన రావణునికి సందేహం కలిగేటట్లుగా శివుడే హంస రూపంలో సీతారాముల మధ్య దౌత్యం నెరపడానికి వచ్చాడా అన్నట్లుగా అద్భుతమైన కల్పన చేశారు. కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు.
No comments:
Post a Comment