సారభుజాస్థలంబున బ్రసన్నత దాల్చుము శ్రావణాంబుద
శ్రీరుచిరాకృతిన్ సవదరింపుము చల్లనివాన శౌర్య రే
ఖారయనిర్జితాసురనికాయ ! ప్రశాంత ధరిత్రి నేలవే !
దశరథుని ఆనందానికి అవధులు లేవు. తెల్లవారితే రామచంద్రునికి రాజుగా పట్టాభిషేకం. అందుకని బ్రహ్మచర్యాన్ని పాటించి, వ్రతదీక్షలో ఉండమని రామునికి చెప్పాడు తండ్రి. కుమారునికి కొంత రాజనీతిని బోధించాడు. ఆనందాతిరేకంలో ఇంకా ఇలా అన్నాడు:
" ఊపిరి తీసుకొనడానికి కూడా వీలులేని యీ రాజకార్య భారాన్ని నీ భుజస్కంధాల మీద పెడుతున్నాను. ప్రశాంతమైన మనస్సుతో ఆ బాధ్యతను స్వీకరించు. శ్రావణమేఘంలా నీ చల్లని పాలన అనే వర్షాన్ని కురిపించు. శాంతిసౌఖ్యాలతో విలసిల్లేటట్లు యీ భూమిని పాలించు. "
ధర్మబద్ధంగా రాజకార్యనిర్వహణ అనేది ముళ్ళకిరీటం పెట్టుకొనడం వంటిదని దశరథుని మాటలు చెప్పకనే చెబుతున్నాయి.
దశరథుడు రాముణ్ణి " శౌర్యరేఖారయనిర్జితాసురనికాయ " అని సంబోధించాడు. రాముని అవతార లక్ష్యం అసుర సంహారం. అది విశ్వామిత్రునితో పాటు యాగ సంరక్షణకు రామలక్ష్మణులను పంపటంతో ఆరంభమయింది. తెలిసి పలికినా, తెలియక పలికినా, అసురలను నిర్జించటం అనే రాముని లక్ష్యం తదనంతర కాలంలో కొనసాగబోతున్నదనే వస్తుధ్వని దశరథుని సంబోధనలో వ్యంజింపబడింది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యాకాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment