జీవుల గామసంగత విశిష్టుల దుష్టుల దుష్టధర్మపుం
ద్రోవలు మౌని వెన్నెముకతో హరియించెడు ధర్మమూర్తియై
యావృత వృత్రనామ తిమిరౌఘ విదారణ భాస్కరుండు ర
క్షో విమతారి వాసవునకుం ద్రిజగత్పతికిన్ నమస్కృతుల్.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందరకాండము, పూర్వరాత్ర ఖండము నందలిది.
హనుమంతుడు సముద్రాన్ని దాటి, లంకకు చేరడానికి ఉద్యుక్తుడౌతున్న సమయంలో దేవతా ప్రార్థన చేశాడు. ముందు, తనకు గురువు, జగదక్షి అయిన సూర్యభగవానుని స్తుతించాడు. తరువాత, లక్ష్మణసమేత రఘురామునికి వందనాలు సమర్పించాడు. ఇప్పుడు, ముల్లోకాలకు అధిపతియైన దేవేంద్రునికి నమస్కరిస్తున్నాడు.
" జీవులు కామసంగతులు. కోరికలతో పాటు పుట్టారు. అదే వారి ప్రత్యేకత. ఆ కోరికలు వారిని చెడుత్రోవలు పట్టేటట్లు చేస్తుంది. అటువంటి చెడునడత కలవారిని, మునీశ్వరుని వెన్నెముకతో సమూలంగా నిర్మూలించే ధర్మమూర్తి దేవేంద్రుడు. వృత్రుడు అనే పేరుతో, అన్నివైపులా వ్యాపించిన చీకట్ల సమూహాన్ని పోగొట్టే సూర్యుడు దేవేంద్రుడు. రాక్షసత్వమనే విరుద్ధమైన మతానికి శత్రువు దేవేంద్రుడు. అటువంటి త్రిలోకాధిపతికి, వాసవునికి (ఇంద్రునికి) నమస్కరిస్తున్నాను. "
ఈ పద్యంలో ఉన్న రెండు విశేషాలను పరిశీలిద్దాము.
అధర్మాన్ని ప్రవర్తింప చేసే అసురులను తుదముట్టించి ధర్మాన్ని నిలబెట్టడంకోసం, దధీచి అనే మహర్షి వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారుచేసుకొన్నాడు ఇంద్రుడు. దధీచి ప్రాణత్యాగంతో నిర్మించబడ్డ వజ్రాయుధం త్యాగానికి ప్రతీక. కోరికలు నశిస్తే గాని త్యాగబుద్ధి అలవడదు. ఈ విషయాన్నే ఈశావాస్యోపనిషత్తు :
" ఓం ఈశావాస్య మిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన బుఞ్ఙీథా మాగృధః కస్య స్విద్ధనం. " అని నిర్వచించింది.
(ఈ జగత్తులో ఏవైతే ఉన్నాయో, అవన్నీ భగవంతునిచే ఇవ్వబడినవి. అందువల్ల, స్వార్థబుద్ధి ( కోరికలు) విడిచి, త్యాగబుద్ధితో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీ ఆశించకు.)
అందువల్ల, వజ్రాయుధం జీవుల కోరికలను నశింపజేసేది. దానిని చేత ధరించిన ధర్మమూర్తి ఇంద్రుడు.
వృత్తము, గుండ్రంగా, సంపూర్ణంగా ఉంటుంది. చీకటి ఎంతదూరమైనా వ్యాపిస్తుంది. అజ్ఞానానికి పరిమితులు లేవు. అటువంటి అజ్ఞానమనే చీకటిని పారద్రోలే భాస్కరుడు (వెలుగును ప్రసాదించేవాడు) ఇంద్రుడు. అందుకే, ఇంద్రుడు సహస్రాక్షుడు, అంతులేని కిరాణములు కలవాడు. సంస్కృతంలో ' సహస్ర ' శబ్దానికి అనంతము అని అర్థం. అవధులు లేని అజ్ఞానాన్ని పోగొట్టాలంటే అనంతమైన వెలుగు కావాలి. ఆ వెలుగు ప్రసరింపజేసే వాడే ఇంద్రుడు.
No comments:
Post a Comment