అంత బయోనిధానమున యం దుదయించె సరోజవాసినీ
కాంతకు దోడబుట్టువనగా గరపద్మమునం జలూకికా
సంతతియున్ హరీతకియు సాధనసంతతియై తలిర్ప ధ
న్వంతరి యెట్టిరోగములవారి కనామయసౌఖ్యకారియై.
ఆదివైద్యు డతండు దుగ్దాబ్ధి బుట్టె
నమృతపూర్ణకుంభం బొక హస్తమునను
నంబుచరమును గరకకాయయును నొకట
దాల్చి సాకారమైన శాంతమ యనంగ.
క్షీరసాగరమథనంలో ముందు హాలాహలం పుట్టింది. లోకక్షేమం కోసం, శివుడు దాన్ని తన కంఠంలో దాచాడు. తరువాత, లక్ష్మీదేవి పద్మంలో నుంచి ఉద్భవించింది. ఆ తరువాత రెండు గడియలకు, కలువచెలికాడు చంద్రుడు పుట్టాడు. తరువాత, మందారము, కల్పవృక్షము, హరిచందనము, సంతానవృక్షము, పారిజాతము పుట్టాయి.
ఇంకా చిలుకగా చిలుకగా, పాలసముద్రంలో నుంచి పద్మవాసిని లక్ష్మికి తోడబుట్టువు అన్నట్లుగా ఒక చేతిలో తామరలు, ఇంకొక చేతిలో కర్క్కాయ, పట్టుకొని, అవి తనకు అవసరమైన వైద్యసామాగ్రిగా, యెటువంటి రోగాలనైన పోగొడతాను అన్నట్లుగా, అందరికీ సుఖాన్ని, సంతోషాన్నీ కలిగించేవానిగా, ధన్వంతరి ఉద్భవించాడు.
పాలసముద్రం నుండి పుట్టిన ఆదివైద్యు డాయన. ఒక చేతిలో అమృతకలశం, రెండవ చేతిలో తన వైద్యసామగ్రి అయిన జలూకికాసంతతి (జలగను), హరీతకి (కరక్కాయచెట్టు) , పట్టుకొని, శాంతం ఆకారం దాల్చి వచ్చిందా అన్నట్లు ఉన్నాడు.
ధన్వంతరి నాలుగు చేతులలో, శంఖం, చక్రం, అంబుచరము జలగ, కరక్కాయ చెట్టు ధరించినట్లుగా చిత్రించారు. ప్రాచీన ఆయుర్వేద వైద్యులు కుష్ఠురోగము వంటి వానికి జలగను వాడేవారని, అది కుష్ఠురోగుల చెడురక్తాన్ని పీల్చివేస్తుందని, పెద్దలు చెబుతారు. శ్రీనాథుడు కూడ వృత్తంలో అమృతకలశాన్ని, కరక్కాయ చెట్టును, తేటగీతిలో, అంబుచరం జలగను, కరక్కాయ చెట్టును పట్టుకున్నట్లుగా వర్ణించాడు.
ఇదీ శ్రీనాథమహాకవి హరవిలాసము కావ్యం, సప్తమాశ్వాసంలో వర్ణించిన ఆదివైద్యుడు ధన్వంతరి స్వరూపం.
" ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి ధన్వంతరిః " - మనస్సు, శరీరానికి బాధను కలిగించే శల్యములను, అనగా, దోషాలు, రోగాలు, శరీరం లోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైనవాటిని నివారించేవానిగా చెప్పవచ్చును.
No comments:
Post a Comment