లాలస లేకుండ జూచినన్ నీ విలాసంబు గాగ
నీ లోకమంతయు నీవుగా దోచు, నెద గోర్కి క్రమ్మ
నీ లోకమందు నీ పొడయె కన్పించదేమి చిత్రమ్ము
ప్రాలేయ కరుణ! శ్రీ కాళహస్తీశ్వరా! మహాదేవ!
విశ్వనాథవారు ఈ మధ్యాక్కరలో శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి దయ చూపించమని అడుగుతున్నారు. ఏ కారణం చేత?
ప్రొద్దున్నే, ఎండ పొడ తగిలితే శరీరానికి హాయిగా ఉంటుంది. పరమేశ్వరభావము అనే పొడ తగిలితే, మనస్సు నుండి విషయవాంఛలు తొలగి, తత్త్వం బోధపడుతుంది. లాలస, అంటే, విషయవాంఛలు లేకుండా ఉన్నప్పుడు ఈ విశ్వమంతా పరమేశ్వర విలాసంగా, దేనిని చూసినా అందులో ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. అదే, మనసులో కోరికలు ఉద్భవిస్తే, పరమేశ్వరుడు ఉండవలసిన చోట కోరికలు పీట వేసుకొని కూర్చుంటాయి. ఇది నిజంగా చిత్రమైన స్థితి. కానీ, నిజం. అందువల్ల, ఉషోదయమైనట్లు, తన మనసులో జ్ఞానోదయం కలిగించమని కవి వేడుకొంటున్నాడు.
ప్రాలేయము (మంచు) స్వచ్ఛతకు సంకేతం. మలినాలను కడిగివేస్తుంది. అందుకనే, విశ్వనాథవారు శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి, మహాదేవుడిని, " ప్రాలేయ కరుణ" అని సంబోధించారు. అంటే స్వచ్ఛమైన కరుణ రసాన్ని కురిపించి, మనస్సులోని మాలిన్యాన్ని, హృదయమాలిన్యాన్ని కడిగివేసి, నిరంతరం పరమేశ్వరభావనలో ఉండేటట్లు చేయమంటున్నాడు.
ఈ పద్యం విశ్వనాథ మధ్యాక్కరలు అనే గ్రంథంలో శ్రీ కాళహస్తి శతకంలో ఉన్నది.
No comments:
Post a Comment