నేనుం జేసితి జన్నముల్ ధరణి బండింపించితిన్ ధర్మముల్
నేనుం జేసితి సత్క్రియాతతి సురానీకంబు కార్యంబులున్
నేనుం దాల్చితి బిట్టుగా నఱితి దండ్రీ ! యోయి కాకుత్స్థ ! కా
గా నేడీ తల తెల్లనైనది శరత్కాశ ప్రతీకాశమై.
దశరథుడు, సుమంత్రుణ్ణి పంపించి, శ్రీరాముడిని తన వద్దకు పిలిపించాడు. యౌవరాజ్యపట్టాభిషేకం గురించి చెప్పాడు. ఆ శుభవార్త వినడానికి ఎంతకాలం నుండో వేచియున్నటువంటి, రాముని మిత్రులు, పరిగెత్తుకొంటూ వెళ్ళి యీ వార్త కౌసల్యకు చెప్పారు. అందరూ ఆనందంలో మునిగిపోయారు. రాముడు తన సౌధానికి తిరిగివచ్చిన కొంతసేపటికే, మళ్ళీ అతడిని పిలుచుకురమ్మని వార్త వచ్చింది. కలవరపడ్డ రాముడు, సేవకుడిని కారణ మడిగాడు. రాముణ్ణి చూడాలనే ఆశతోనే తండ్రిగారు పిలిచారని బదులిచ్చాడు సేవకుడు.
రాముడు తండ్రి వద్దకు వెళ్ళగానే, దశరథుడు కొడుకుని కౌగిలించుకొని, పట్టాభిషేకానికి పుష్యమీ పుణ్యలగ్నం కుదిరిందనీ, అందువల్ల ముందురోజు ఉపవాసముండి, బ్రహ్మచర్య దీక్షలో ఉండాలనీ, చెప్పాడు.
ఇంకా రామునితో ఈ విధంగా అన్నాడు.
" నాన్నా ! నేను కూడా యజ్ఞయాగాదులు చేసి రాజ్యంలో ధర్మాన్ని నిలబెట్టాను. దేవతలకు యుద్ధంలో సహాయం చేయడం వంటి మంచి పనులు కూడా చేసాను. అందరిపై ప్రేమ, వాత్సల్యం పుష్కలంగా చూపించాను. కానీ, నా తల ఇప్పుడు శరత్కాలంలో పూచే ఱెల్లు పూలంత తెల్లగా అయిపోయింది. "
రాముని యొక్క ధర్మాభిముఖమైన మనస్సు దశరథునికి తెలియనిది కాదు. కానీ, యౌవరాజ్యాభిషిక్తుడౌతున్న వేళ కుమారునికి బాధ్యతలను పరోక్షంగా గుర్తుచేసాడు తండ్రి దశరథుడు. ధర్మానురక్తులు చేసే పని అది.
పద్యం మూడు పాదాలలోను, ప్రారంభంలో " నేనుం " అన్న " పదాన్ని వాడటం ద్వారా, విశ్వనాథవారు, సంతానలేమితో దుఃఖాక్రాంతుడైన బాలకాండము నాటి దశరథుడు, అయోధ్యాకాండము, అభిషేకఖండం నాటికి, తన వారసుడు రాముణ్ణి చూసి ఏ విధంగా ఒకింత గర్వంతో పొంగిపోతున్నాడో, ధ్వనింపజేసారు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యాకాండము, అభిషేక ఖండము నందలిది.
No comments:
Post a Comment