దురితము సేసి తాపమున దూలిన నిం కిట సేయ నన్మతిం
బొరసిన ధర్మ సంచరణ బుద్ధియ మేలని యూదినం గ్రియా
పరు డయి మేలుసేసినను బాదము పాదముగా గ్రమంబునన్
విరియు సమస్తముం దదభివిష్టకళంకము నిర్భయంబుగన్.
నరవర! వాసవుం డడిగినన్ గురు డిట్లని చెప్పె బుద్ధితో
బొరయని పాతకంబులు సబుద్ధికపుణ్యములన్ నశించు నం
బరమున బట్టినట్టి మలపంకము గారములోన నద్దగా
విరిసిన యట్లు నమ్ము మిది వేదము సెప్పె నేను జెప్పితిన్.
పరీక్షిన్మహారాజు కుమారుడైన జనమేజయుడు తెలియక బహ్మహత్యాదోషానికి గురయ్యాడు. జనమేజయుడిని ప్రజలు, బ్రాహ్మణులు దూషించటం మొదలుపెట్టారు. దానితొ అతడు శోకంతో లోలోన కుమిలిపోయాడు. ఆ పాపపరిహారార్థం, శౌనకుడు అనే మహామునిని కలిసి అతడిని శరణువేడాడు. పాపప్రక్షాళణ చేసుకొనే ఉపాయం చెప్పమన్నాడు. అప్పుడా ముని జాలిపడి జనమేజయునికి ఒక ధర్మశాస్త్రం చెప్పాడు.
" పాపం చేసి పశ్చాత్తాపబడినా, ఇకముందు ఇటువంటి పాపాలను చేయను అని దృఢమైన మనఃసం కల్పం చేసుకొన్నా, న్యాయబద్ధంగా మెలగాలని నిర్ణయించుకొన్నా, పుణ్యం పొందాలని ఆశతో ఉపకారం చేసినా, పాపపంకిలం క్రమక్రమంగా తుడుచుపెట్టుకొనిపోతుంది. భయపడాల్సిన పనేమీ లేదు. "
ఇంకా శౌనకముని జనమేజయుడితో ఇట్లా చెప్పాడు.
" ఓ రాజా ! ఇంద్రుడు అడిగితే దేవగురువు బృహస్పతి చెప్పిన ఒక విషయాన్ని నీకు చెబుతున్నాను. బట్టలకు పట్టిన మురికి చవుడుతో వదలిపోయేటట్లుగా, తెలియక చేసిన పాపాలు బుద్ధిపూర్వకంగా చేసిన పుణ్యకార్యాలతో తుడిపెట్టుకుపోతాయి. ఇది వేదం చెప్పిన మాట. నన్ను నమ్ము. "
ఈ రకంగా శౌనకముని జనమేజయుని పాపప్రక్షాళన కోసం, అతడి చేత తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు, అశ్వమేథయాగం చేయించి, అతడిని కృతార్థుడిని చేశాడు.
ఈ ఘట్టం, శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment