ఈ లోకము నిస్సారం
బాలోకింపగ ననటి యట్టుల యని తా
లోలత బొందని పురుషుం
డేలా నెవ్వగల జెందనిచ్చు మనంబున్?
అరయ వచ్చిన తన మేను నెరవ తనకు
నొండు రూపులు దక్కక యునికి యరుదె?
యను తలంపు ధృవంబుగ నలవరించి
బుధజనంబులు శోకంబు బొరయ రధిప !
ఒక యింటనుండి వేఱొక యింటి కరిగిన
విధమును వస్త్రంబు విడిచి యొండు
వస్త్రంబు గట్టిన యొడుపును నై యుండు
నొడలు దొఱంగి యొండొక్క యొడలు
గైకొంట నృప ! విను కడవకు సారెపై
నమర మృత్తిక యిడినపుడు విరియు
టయు వెరవార బట్టకరాక చెడుటయు
వాని యెత్తెడు నెడ వ్రయ్యుటయును
నెత్తి యొకచోట డించిన నెడలుటయును
నెండి అవియుటయును నావ మిడిన బగిలి
పోవుటయు వాడు జనులచే బొలియుటయును
గలుగు గతి మేనికెట్లును గలుగు జేటు.
దుర్యోధనాదుల మరణానికి దుఃఖిస్తున్న ధృతరాష్ట్రుడికి తత్త్వబోధ జేసి ఊరడిస్తున్నాడు విదురుడు.
" ఈ సంసారావృక్షం అరటి చెట్టు లాంటిది. చాలా దుర్బలమైనది. ఈ విషయం తెలిసిన వివేకవంతుడు దాని మీద ఆసక్తి ఊపించి, మనస్సును ఎందుకు బాధలకు గురిచేస్తాడు? చక్కగా ఆలోచిస్తే, ఈ శరీరం కూడా తనకంటె భిన్నమైనదే. ఈ శరీరం ఇతర రూపాలు పొందడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదని తెలిసికొన్న జ్ఞానులు, ఆ విషయంలో శోకించరు. మరణమంటే ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ధరించడమే. ఇది ఒక ఇంటిలో నుండి మరొక ఇంటిలోకి మారటం, ఒక బట్టను విడిచి మరో బట్ట కట్టుకోవటం వంటిది. కుండను తయారు చేయడానికి కుమ్మరివాడు సారెమీద మట్టిని అమరుస్తాడు. ఆ మట్టిని అమర్ఛేటప్పుడు మట్టి విరిసిపోవచ్చు. కుండను చేసి పైకి ఎత్తేటప్పుడు పగిలిపోవచ్చు. క్రింద పెట్టేటప్పుడు బీట్లివ్వవచ్చు. ఆవం మీద కాల్చేటప్పుడు సరిగా కాలక పగుళ్ళు చూపవచ్చు. చివరికి, కుండను వాడేటప్పుడు కూడా పగిలిపోవచ్చు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోవటం మాత్రం తథ్యం. ఆ కుండ శాశ్వతం కాదు. మరణం కూడా అంతే. ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు నశించక తప్పదు. "
ఉపనిషత్తుల దగ్గర నుంచి, భగవద్గీత, పురాణవాఙ్ఞయం దాకా చెబుతున్నదిదే. విదురుడు ఆ సత్యాన్నే ధృతరాష్ట్రునికి బోధపరిచాడు.
ఈ జీవితసారమంతా శ్రీమదాంధ్ర మహాభారతము, స్త్రీపర్వం, ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment