కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం
అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున.
పామరులైనవారి కనువర్తితమైనది, దివ్యమౌ పరం
ధామ నిరోధకంబు, బహుధా యపకీర్తికి కారణంబు నౌ
యీ మలినంబు నీ హృదిని నెట్టుల బొందగ నయ్యెనేమొ ! సం
గ్రామము సేయ బూను తరుణంబున నక్కట ! పాండునందనా !
యుద్ధరంగంలో, బంధుమిత్రులను, గురువులని, తనకు కావలసిన వారిని చూసి, కనికరం నిండినవాడై, కన్నీరుమున్నీరయ్యాడు అర్జునుడు. ఆ పరిస్థితిని చూసి అతనితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు.
" అర్జునా ! తెలివితక్కువవాళ్ళు చేసేది, స్వర్గానికి వెళ్ళటానికి ఆటంకం కలిగించేది, అపకీర్తిని తీసుకొచ్చేది అయిన యీ మనోదౌర్బల్యం, యీ మురికి నీ మనస్సుకి ఎట్లా అంటుకుంది? "
భయం, శోకం , మోహం, రాగం, ద్వేషం - ఇలాంటివన్నీ మనస్సుకు పట్టిన మురికి వంటివి. శరీరానికి పట్టిన మురికిని శుభ్రమైన నీటితో కడుక్కుంటాము. మనస్సుకు పట్టిన మురికిని వదిలించాలంటే, ధైర్యం, ఉత్సాహం, సమత్వం వంటివి కావాలి. బుద్ధిమంతులు యీ లక్షణాలను అలవరచుకుంటారు. అవివేకులు పిరికితనం, లోభం, మొహం, రాగం మొదలైన వాటికి లోబడతారు.
ఈ శ్లోకం సాంఖ్యయోగం లోనిది. సాంఖ్యము అంటే జ్ఞానము. జ్ఞానసముపార్జనలో ఆత్మానాత్మ విచారణ అవసరం. అనాత్మ వస్తువులను గుర్తించి, లెక్కించి, వేరుపరచి, ఆత్మజ్ఞానాన్ని పొందటమే సాంఖ్యయోగము.
No comments:
Post a Comment