అవికృతు డౌచు దా వికృతి నంది మొదల్, జగమింత యింతయై
న వికృతి చేసి, తొల్లిటి ఘనస్థితి గాంచగ ధర్మమొండు వే
ద హితమున్ ఘటించి, యది తప్పిన శిక్ష యటంచుబెట్టి యు
త్సవ వయ దూర్ణనాభి కృత తంతునకున్ విధికిన్ నమస్కృతుల్ .
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములోని చతుర్ముఖ బ్రహ్మ స్తుతి.
బ్రహ్మపదార్థము ఏకము, నిత్యము, అవికారము, అపారిణామ ప్రాప్తము, దానినే మనం నిర్గుణ పరబ్రహ్మ తత్త్వం అంటాము. నిర్గుణబ్రహ్మము ఏకమైనప్పటికీ, వికార రహితమైనప్పటికీ, అనేక రూపాలుగా విభక్తమవ్వాలనే కోరికతో , ఈ జగత్సృష్టికి కారణమయింది. అదే సగుణాకార చతుర్ముఖబ్రహ్మ స్వరూపం. అదే నిర్గుణబ్రహ్మ తత్త్వం ప్రతి జీవునిలోను ఉన్నది. ఉపాధి భేదంతో, ఆ తత్త్వం, పలు రూపాలుగా భాసిల్లుతూ ఉంటుందని వేదాంతం చెబుతుంది. సృష్టికర్త అయిన చతుర్ముఖబ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు. జగత్తు పరిణామం చెంది ఇంతకు ఇంత వృద్ధి అయింది. కానీ, ఆ జగత్తులోని జీవులు మరల తొలుతటి, అఖండమైన ఏకత్వాన్ని, బ్రహ్మానుసంధానాన్ని పొందాలంటే ధర్మాచరణ తప్పనిసరి చేశాడు. ఆ ధర్మాచరణకు వేదాన్ని ప్రమాణంగా పెట్టాడు. వేదవిరోధులకు శిక్షను నిర్దేశించాడు. అటువంటి సృష్టికార్యాన్ని నిర్వహించే చతుర్ముఖబ్రహ్మకు నమస్కరిస్తున్నాను అని హనుమంతుడు సముద్రోల్లంఘనకు ఉద్యుక్తుడయ్యాడు..
శుద్ధబ్రహ్మము అవికృతుడు. అంటే వికారములకు లోనుగాని వాడు. కానీ, జగత్సృష్టి జరగాలంటే వికృతుడవ్వాలి. సగుణు డవ్వాలి. అందువల్లనే చతుర్ముఖబ్రహ్మ ఆవశ్యకత. ఆయన ఊర్ణనాభి కృత తంత్రుడు. ఊర్ణనాభము అంటే సాలీడు. సాలీడు కనుక తన నుండి సాలెగూడు అనేటటువంటి ప్రపంచాన్ని ఉద్భవింపజేస్తుందో, అదే విధంగా నిర్గుణపరబ్రహ్మము, సగుణాకారుడై, ఈ జగదుద్భవానికి కారకు డయ్యాడు.
జగత్తులోని ప్రతిదీ పరిణామ వికారాలకు గురించి అవుతుంది. యాస్కుడు నిరుక్తంలో ఆరు రకాలైన వికృతులను చెప్పాడు.
షడ్భావ వికారా భవంతీతి......జాయతే, అస్తి, విపరిణమతే, వర్థతే, అపక్షీయతే, వినశ్యతీతి.
పుట్టటం, ఉండటం, మార్పు చెందటం, పెరగటం, క్షీణించటం, నశించటం అనే ఆరు వికారాలు జగత్తులోని వస్తువులకు సహజ లక్షణాలు.
ఈ షడ్వికారములతో కూడిన జగజ్జీవ భావం నుండి వెలువడి, పునరావృత్తి రహిత, జగదతీత బ్రహ్మైక్యాను సంధానం పొందాలంటే, వేదవిహితమైన ధర్మాచరణ తప్పనిసరి.
No comments:
Post a Comment