అనవుడు భీముడిట్టులను ' నర్జుననందన ! నీవు ముంద రి
మ్మొన యొకయింత సించిన నమోఘరయంబున బార్షతుండు నే
నును ద్రుపదుండు సత్యకతనూభవుడున్ విరటుండు నంత నం
త నడరి చింతు మెల్లెడలు దారుణవిక్రమజృంభణంబునన్.
ఇది శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసం లోని పద్యం.
అభిమన్యుడిని పలువురు చుట్టిముట్టి చంపారని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఆశ్చర్యాన్ని, దుఃఖాన్ని వెలిబుచ్చి, ఆ వివరాలన్నీ చెప్పమన్నాడు.
ద్రోణుడు వలయాకారంగా పద్మవ్యూహాన్ని పన్ని, అందులో తగువారిని తగిన చోట్లలో నిలబెట్టాడు. శత్రుదుర్భేద్యమైన, ఆ పద్మవ్యూహంలోకి చొచ్చుకొని వెళ్ళడం, శ్రీకృష్ణుడికి, అర్జునుడికి, ప్రద్యుమ్నుడికి, అభిమన్యుడికి, తప్ప మరెవరికీ తెలియదన్న సంగతి ధర్మరాజుకు తెలుసు. అర్జునుడు యుద్ధరంగలో పోరాడుతూ వేరొకచోట ఉన్నాడు. అందువల్ల, పద్మవ్యూహాన్ని చేదించుకొని లోపలికి వెళ్ళమని అభిమన్యకుమారుడిని ధర్మరాజు కోరాడు. ఇది వినగానే, అభిమన్యుడు ఉప్పొంగిపోయాడు. పద్మవ్యూహం నుండి బయటకు రావటం తనకు తన తండ్రి నేర్పలేదని, అయినా నిరుత్సాహపడవలసిన అవసరం లేదని అభిమన్యుడు అన్నాడు. దానికి భీముని సమాధానమే ఈ పద్యం.
" అర్జుననందనుడవైన అభిమన్యూ ! నీవు ముందు కొంచెం పద్మవ్యూహాన్ని చేదించుకొని లోపలికి వెళ్ళగానే, వేగంగా, నేను, ద్రుపదుడు, సాత్యకి, విరాటరాజు మొదలైన వారమంతా చొచ్చుకొని వచ్చి, కొంచెం దూరలో ఉండి నిన్ననుసరిస్తూ, అడ్డుతొలగించుకొంటూ, శత్రువర్గాన్ని చీల్చి చెండాడుతాము.
" అర్జుననందన ! " అన్న భీముని సంబోధన, పద్మవ్యూహాన్ని ఛేదించటంలో నీవు అర్జునుడి అంతటి వాడివని ధ్వనిస్తున్నది.
' పార్షతుండు ' అన్న పదానికి అర్థం పృషితుని కుమారుడైన ద్రుపదుడు అని, పార్షదుడు (పారిషదుడు, ప్రమథగణములకు చెందినవాడు) అనే అర్థంలో మరుద్గణముల అంశతో పుట్టినవాడైన ద్రుపదుడు అని, రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చునని అనిపిస్తున్నది. అయితే, ' ' పార్షతుండు ' అన్న పదాన్ని వాడిన తరువాత ' ద్రుపదుండు ' అన్న పదాన్ని ఎందుకు వాడారో అర్థం కాలేదు. పెద్దల నుంచి తెలుసుకొనవలసిన విషయమిది.
సత్యకతనూభవుడు సాత్యకి. శిని వృష్ణివంశీయుడు. అతని కుమారుడు సత్యకుడు. సత్యకుని కుమారుడు సాత్యకి. శ్రీకృష్ణునికి తమ్ముని వరస.
మహాకవులు సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సరియైన ఛందోరీతిని ఎన్నుకుంటారు. తిక్కనగారు ఇక్కడ చంపకమాల వృత్తాన్ని వాడారు. చంపకమాల ద్రుతగతితో కూడుకొన్నది. పద్యం నడక వేగాన్ని తెలియజేస్తుంది. పద్యం దీర్ఘసమాసాలు లేకుండా, ముక్కలు ముక్కలుగా ఉన్నట్లు కనిపించినా, పద్యం మొత్తం లోని నకారాలు ద్రుతగతికి తోడ్పడుతున్నాయనీ, పద్యం తునకలు తునకలుగా రచించటం, శత్రువులను తుత్తునియలు చేయడాన్ని వ్యంజిస్తున్నదని పెద్దల విశ్లేషణ. ఇది తిక్కన శిల్పకళాచాతుర్యానికి, ఔచితీరచనకు నిదర్శనం.
ఇంకొక మాట. అచ్చ తెలుగు పదాలు " సించిన, చింతు " వంటివి, వాని సమానార్థక సంస్కృత పదాలకన్నా ఎక్కువ పరాక్రమోద్ధతిని తెలియజేస్తున్నాయి. వర్తమాన సమాజంలో, ' చించేశాడు ' అనే పదాన్ని ' బ్రహ్మ్మాడంగా చేశాడు ' అనే అర్థంలో వాడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.
No comments:
Post a Comment